ఇంధన పొదుపు ‘కలెక్టరేట్లు’

29 Aug, 2018 01:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే ప్రప్రథమంగా ఇంధన పొదుపు భవన నియమావళి(ఈసీబీసీ) ని అమలుచేసిన రాష్ట్రం గా తెలంగాణ నిలిచిం దని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల కలెక్టర్‌ కార్యాలయ సముదాయాలను ఇంధన పొదుపు నియమావళికి అనుగుణంగా నిర్మించనున్నామన్నారు. ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌పై మంగళవారం ఇక్కడ జరిగిన ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.

1000 చదరపు మీటర్లు, ఆపై విస్తీర్ణంలో నిర్మించే భవనాల విషయంలో ఇంధన పొదుపు నియమావళిని తప్పనిసరిగా పాటించాలనే నిబంధనలను అమల్లోకి తెచ్చామని, గత జనవరి నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలుచేస్తున్న ఈ నిబంధనను భవిష్యత్తులో వరంగల్, కరీంనగర్‌లకు విస్తరిస్తామన్నారు. కూల్‌ రూఫ్‌ పరిజ్ఞానంతో భవన నిర్మాణాలను రాష్ట్రంలో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) అమల్లోకి రానుందని తెలిపారు. స్థిరాస్తి ప్రాజెక్టుల అనుమతులకు దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపువంటి ప్రక్రియలన్నీ ఆన్‌లైన్‌ చేశామన్నారు.

మరిన్ని వార్తలు