అమాత్యునిపైనే ఆశలు! 

21 Feb, 2019 10:26 IST|Sakshi
వేముల ప్రశాంత్‌రెడ్డి

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా సరైన రోడ్లు లేని గ్రామాలెన్నో.. ఆర్టీసీ బస్సుల ముఖం చూడని పల్లెలెన్నో.. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, ప్రత్యేక తెలంగాణలోనూ రవాణా సౌకర్యాల్లో పెద్దగా మార్పు రాలేదు.. పల్లెలకు బస్సుల రాకపోకలు పెద్దగా పెరగలేదు.. అయితే, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా నియమితులు కావడంతో ఉమ్మడి జిల్లాల ప్రజలు ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు. ఉభయ జిల్లాల్లో రవాణా కష్టాలు తీరడంతో అన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణం, బస్సు సౌకర్యం కలుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.

సాక్షి, కామారెడ్డి: సమాజ పురోభివృద్ధిలో రోడ్డు, రవాణా వ్యవస్థ అత్యంత కీలకమైనది. సాంకేతికంగా దూసుకుపోతున్న నేటి కాలంలో సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా రవాణా రంగం అభివృద్ధికి నోచుకోలేదు. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడవడం లేదు.

రోడ్డు సౌకర్యం ఉన్న అన్ని గ్రామాలకు బస్సులు నడుపుతామన్న ఆర్టీసీ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ మంత్రి గా నియమితులు కావడంతో ఉమ్మడి జిల్లా ప్ర జలు ఆయన పైనే ఆశలు పెట్టుకుంటున్నారు. జిల్లాకు చెందిన వ్యక్తే రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినందున ఉమ్మడి జిల్లాలో రవాణా కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు.

ఇదీ పరిస్థితి.. 
నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలోని కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఆరు బస్‌ డిపోలు ఉన్నా యి. వాటి పరిధిలో 668 బస్సులు మాత్రమే ఉ న్నాయి. రోజు సగటున 3.50 లక్షల మంది ఆ యా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆయా బస్సు లు రోజుకు సరాసరిగా 2.85 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, ఆర్టీసీకి రూ.90 లక్షల ఆదా యం సమకూరుతోంది. కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు, నిజామాబాద్‌ జిల్లాలో 530 పం చాయతీలు ఉన్నాయి.

వాటికి తోడు ఆవాస గ్రా మాలు మరో వంద ఉంటాయి. అయితే, ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో బస్సు ముఖం చూడని గ్రా మాలెన్నో ఉన్నాయి. సగానికి పైగా గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. దీంతో ప్రజలు ఆటోల్లో నే ప్రయాణిస్తున్నారు. ఆటోలో పరిమితి మించి ప్రజలను తరలిస్తుండడంతో తరచూ ప్రమాదా లు జరుగుతున్నాయి. గతేడాది ముప్కాల్‌ సమీపంలో ఆటో ప్రమాదవశాత్తు బావిలో పడి పదకొండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. చిన్నాచితకా ప్రమాదాలు జరగడం, ఒకరిద్దరు మృతి చెందడం నిత్యకృత్యంగా మారింది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటే ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారమే ఉండదు. 

పల్లెలకు వెళ్లని బస్సులు.. 
కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో మెజారిటీ గ్రామాలకు వివిధ పథకాల ద్వారా మంచి రోడ్లు వేశారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసలు, మారుమూల గ్రామాల నుంచి సైతం మండల కేంద్రాలు, ప్రధాన రహదారులను కలుపుతూ బీటీ రోడ్లు వేశారు. దాదాపు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంది. అయితే, గతంలో రోడ్డు బాగా లేదనే సాకుతో ఆర్టీసీ బస్సులు నడిపేది కాదు. కానీ ఇప్పుడు రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. కొన్ని గ్రామాలకు విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడుపుతున్నారు. ఉదయం గ్రామాలకు వెళ్లి పిల్లల్ని పట్టణాలకు చేరుస్తాయి. తరువాత సాయంత్రం తిరిగి ఊళ్లకు వెళ్లి దింపి వస్తాయి. మిగతా సమయాల్లో ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండక పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆటోల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఎక్స్‌ప్రెస్‌ బస్సు సౌకర్యం లేదు. వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్‌ నియోజకవర్గంలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్‌ తదితర మండలాల నుంచి జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు రెండు, మూడు బస్సులు ఎక్కాల్సి వస్తోంది.

హామీలుగానే బస్‌ డిపోలు.. 
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేటలలో బస్‌ డిపోలు ఏర్పాటు చేయడానికి రెండు దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు జరిగాయి. ఆర్టీసీ స్థలాన్ని కూడా సేకరించింది. దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ డిపోలు ఏర్పాటు కాలేదు. ప్రతీ ఎన్నికల్లోనూ బస్‌ డిపో ఏర్పాటు అంశాన్ని నేతలు ప్రస్తావిస్తారు. ఆ తరువాత మరిచిపోవడం పరిపాటిగా మారింది. ఎల్లారెడ్డిలో బస్‌డిపో ఏర్పాటు చేస్తే ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజక వర్గాల్లోని ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎల్లారెడ్డి, జుక్కల్‌ ప్రాంతాల్లోని గ్రామాలకు కామారెడ్డి, బాన్సువాడ డిపోలకు చెందిన బస్సులే దిక్కవుతున్నాయి. అక్కడే బస్‌డిపో ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరిగేది.

అలాగే నందిపేటలోనూ బస్‌డిపో ఏర్పాటు చేయకపోవడం మూలంగా ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యంగా ఉంది. నష్టాల సాకుతో ఎత్తివేసిన భీమ్‌గల్‌ బస్‌ డిపోను తిరిగి తెరిపిస్తామని నేతలు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దీంతో భీమ్‌గల్‌ పరిధిలోని మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం అంతంత మాత్రంగానే మారింది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో రెండో డిపో ఏర్పాటు ఎంతో అవసరం. కామారెడ్డిలో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయడంతో పట్టణ జనాభా లక్షన్నర దాటింది. పట్టణానికి వలస వచ్చే వారి సంఖ్య పెరిగింది. స్థానికంగా లోకల్‌ బస్సులు నడపాల్సిన అవసరం కూడా ఏర్పడింది.

ప్రమాదమని తెలిసినా.. 
గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఆటోల్లోనే ప్రయాణిస్తున్నారు. ఆటోల్లో ప్రయాణం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రమాదాలు జరిగినపుడు ఆటోవాలాలను ఇబ్బంది పెట్టడమే తప్ప, ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్న ఆలోచనలు చేయడం లేదు. ఆర్టీసీ బస్సు ముఖం చూడని గ్రామాలు ఎన్నో ఉన్నప్పటికీ ఆయా గ్రామాలకు బస్సులను నడిపే విషయంలో ప్రజాప్రతినిధు లు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ బస్‌డిపోలను ఏర్పాటు చేయడంతో పాటు అదనపు బస్సులను కేటాయించాల్సిన అవసరం ఎంతో ఉంది. రవాణా మంత్రిగా ప్రశాంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో నెలకొన్న రవాణా కష్టాలను తీర్చడానికి ఏమేరకు ప్రయత్నిస్తారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు