జల ప్రణాళిక రూపకల్పన 

16 May, 2020 06:39 IST|Sakshi

కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై సీఎం సమావేశం  

17న గోదావరి జలాలపై భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: ఈ వర్షాకాలంలో కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. తొలుత గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన ప్రణాళిక రూపకల్పన కోసం ఈ నెల 17న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి ప్రాజెక్టుల పరీవాహక జిల్లాల మంత్రులు, అధికారులతో జరిగే ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై రోజంతా కొనసాగనుంది. గోదావరి ప్రాజెక్టుల నుంచి ఈ వర్షాకాలంలో నీరు ఎప్పుడు ఎంత విడుదల చేయాలి? ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీలకు నీళ్లు ఎప్పుడు ఎంత తరలించాలి? మిగతా రిజర్వాయర్లకు ఎప్పుడు విడుదల చేలాలి? నీటిని ఎలా వాడుకోవాలి? తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఈ సమావేశానికి గోదావరి నది పరీవాహక జిల్లాల మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లిదయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డిలను ఆహ్వానించారు. అలాగే కృష్ణా పరివాహక ప్రాంతంలో అనుసరించాల్సిన విధానంపై కూడా సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీని ఖరారు చేయాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు