ముంచుకొస్తున‍్న నామినేషన్ల గడువు

17 Nov, 2018 08:58 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: శాసనసభ ఎన్నికల్లో అత్యంత కీలకఘట్టమైన నామినేషన్ల ప్రక్రియకు గడువు ముంచుకొస్తుండటంతో ఆశావహులు, అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. ప్రచారంలో దూసుకుపోతున్న వివిధ పార్టీల అభ్యర్థుల తమ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుండగా.. మరో వైపు సొంత పార్టీలో టికెట్లు ఆశించి భంగపడిన వారు ఇప్పటికే స్వతంత్రులుగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. ఈ చర్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియకు ఇంకా రెండు పనిదినాలు మాత్రమే మిగిలిఉన్నాయి. దీంతో శని, సోమవారాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

అంతేకాదు మిగిలిన ఈ రెండు రోజులు కూడా మంచి ముహూర్తాలే కావడంతో... ఇది వరకే దాఖలు చేసిన వారు సైతం మరో సెట్‌ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు అన్ని పార్టీలకు సంబంధించిన కీలకమైన నేతలు కూడా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పర్యటనలు ఖరారయ్యాయి. ఈనెల 21న జడ్చర్లలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొననున్నారు. అలాగే 25న దేవరకద్ర, నారాయణపేట పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. వీటితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. కొడంగల్, నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాలకు కలిపి నారాయణపేటలో ఈనెల 25న జరగనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.


రెబెల్స్‌ చిచ్చు 
జిల్లాలో మహాకూటమి, టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కొన్ని స్థానాల్లో టికెట్లు రాకపోవడంతో నిరాశకు గురైన ఆశావహులు ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే రెబల్స్‌గా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగగా మరికొందరు కొత్త పార్టీల వైపు దృష్టి సారించారు. పార్టీల అధినేతలు చేసిన బుజ్జగింపులు ఫలించడం లేదు. ఏకంగా నామినేషన్లు వేసి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. అమమ్మతి నేతల తిరుగుబాటుతో అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా పోయింది.

ఇప్పటికే మహాకూటమిలో భాగంగా మహబూబ్‌నగర్‌ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో.. టీపీసీసీ కార్యదర్శిగా ఉన్న మారేపల్లి సురేందర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఎన్‌సీపీ తరఫున బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే మక్తల్‌లో కూడా సీటును టీడీపీకి కేటాయించడంతో అక్కడ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి రెబెల్‌గా బరిలో దిగనున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్‌ పెండింగ్‌లో ఉంచిన దేవరకద్ర విషయంలో డోకూరు పవన్‌కుమార్‌కు టికెట్‌ కేటాయించకుంటే పార్టీకి రాజీనామా చేస్తామంటూ ఆయన అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఒక వేళ తనకు టికెట్‌ కేటాయించకుంటే రెబెల్‌గా బరిలో నిలవాలని యోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.
 
ప్రచారానికి శ్రీకారం.. 
అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు దాదాపు ఖరారు కావడంతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం ముఖ్యనేతలు కూడా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. ఇది వరకే వనపర్తిలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. తాజాగా ఈ నెల 21న మంత్రి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గంలో జరిగే బహిరంగసభలో కేసీఆర్‌ పాల్గొననున్నారు.

అలాగే ఈనెల 25న ఉమ్మడి జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, షాద్‌నగర్‌లో కేసీఆర్‌ పర్యటిస్తారు. అనంతరం మరో రెండు రోజుల తర్వాత జిల్లాలో పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరోసారి జిల్లాలో పర్యటిం చనున్నారు. ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పాలమూరు నుంచే ఆయన ప్రారంభించిన విషయం విదితమే. తాజాగా ఈనెల 25న నారాయణపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కొడంగల్, మక్తల్, నారాయణపేట మూడు స్థానాలకు కలిపి ఒకే చోట ఏర్పాటుచేసిన ఈ సభలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగిస్తారు.

వీరికి తోడు కాంగ్రెస్‌ పార్టీ తరఫున జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభలు కూడా ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా కొడంగల్‌లో రాహుల్‌గాంధీ సభను, గద్వాలలో సోనియాగాంధీ సభ నిర్వహణకు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.    

మరిన్ని వార్తలు