40.66 లక్షల మందికి రుణమాఫీ 

10 Mar, 2020 01:07 IST|Sakshi

ఈ నెలలోనే కొందరు రైతులకు చెక్కుల పంపిణీ

ప్రాథమికంగా నిర్ధారించిన ఎస్‌ఎల్‌బీసీ, వ్యవసాయశాఖ 

రూ.25వేల లోపు రుణాలు ఒకేసారి మాఫీ 

చెక్కుల ద్వారా ఈనెలలోనే పంపిణీ 

మిగిలిన రూ.24,736 కోట్లు 

విడతలవారీగా మాఫీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి 40.66 లక్షల మంది రైతులు అర్హులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ), వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ధారించాయి. రూ.25వేల లోపు ఉన్న పంట రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేస్తా మని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఈ నెలలో రూ.1,198 కోట్లు విడుదల చేయనున్నారు. అయితే, నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేయకుండా సంబంధిత ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కుల ద్వారా పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయిం చారు. తక్కువ మొత్తంలో పంట రుణం తీసుకున్న చిన్న, సన్నకారు రైతుల్లో ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన రూ.24,736 కోట్లు విడతలవారీగా మాఫీ చేయనున్నారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ అమలు మార్గదర్శకాల్లో ఇచ్చే నిబంధనల ఆధారంగా రైతుల సంఖ్యతోపాటు మాఫీ మొత్తం కూడా కొంత తగ్గే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. 

కేటగిరీలవారీగా నివేదిక..
రుణమాఫీకి సంబంధించి కేటగిరీలవారీగా ఓ నివేదికను వ్యవసాయశాఖ ప్రభుత్వానికి పంపింది. రూ.25వేల వరకు ఉన్న రుణాలను ఒక కేటగిరీగా, రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రెండో కేటగిరీగా, రూ.50వేల నుంచి రూ.75వేల వరకు మూడో కేటగిరీగా, రూ.75వేల నుంచి రూ.లక్ష వరకు నాలుగో కేటగిరీగా పేర్కొన్నారు. ఇక రూ.లక్ష పైన ఎంత రుణం తీసుకున్నప్పటికీ రూ.లక్ష మాత్రమే మాఫీ చేయనున్నారు. 2018 డిసెంబర్‌ 11వ తేదీ వరకు ఉన్న రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తారు. రూ.25వేల లోపు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేశాక, రూ.50వేల వరకు ఉన్న రుణాలను కూడా ఒకేసారి మాఫీ చేయాలంటే రూ.3,104 కోట్లు కావాలి. ఈ ఏడాది బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.6,225 కోట్లు ప్రతిపాదించినందున రూ.50వేల వరకు ఉన్న రుణాలను కూడా ఒకేసారి చెక్కుల ద్వారా మాఫీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో రుణమాఫీ సందర్భంగా రైతులకు తలెత్తిన ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక అధికారి తెలిపారు. 

మరిన్ని వార్తలు