‘పచ్చ’బొట్టుకు లక్ష కోట్లు

17 Sep, 2019 01:55 IST|Sakshi

రాష్ట్రావతరణ నుంచి నీటిప్రాజెక్టులపై గణనీయ ఖర్చు

ఇప్పటివరకు రూ. లక్ష కోట్ల వ్యయం.. 

కొత్త ఆయకట్టు 12.90 లక్షల ఎకరాలు 

స్థిరీకరణ 16.46 లక్షల ఎకరాలు 

మొత్తం సాగు 70.10 లక్షల ఎకరాలు

మరో 54 లక్షల ఎకరాలకు నీరిస్తే ప్రాజెక్టుల లక్ష్యాలు పూర్తి

దీనికి మరో రూ. లక్ష కోట్లు అవసరం

సాక్షి, హైదరాబాద్‌: నీటి ప్రాజెక్టులకు ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.లక్ష కోట్లు. ఇంకా చేయాల్సిన ఖర్చు కూడా సుమారు అంతే.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీటివనరులన్నింటినీ వినియోగించుకుని కోటీ 24 లక్షల ఎకరాల ఆయకట్టే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. మరో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే మరో 54 లక్షల ఎకరాలకు నీరందుతుంది. అప్పుడే పూర్తిస్థాయి ఆయకట్టు లక్ష్యాలను చేరుకుంటుంది. ఇప్పటివరకు చేసిన ఖర్చులో 30 శాతం మేర రుణాలే. రుణాలే కీలకం.. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రం హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిరీ్ణతవాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి వంటి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వీటితోపాటే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. రూ.2.27 లక్షల కోట్ల వ్యయ అంచనాతో ప్రాజెక్టులను చేపట్టగా, ఇందులో ఇప్పటి వరకు రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మరో రూ.7,518 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఐదేళ్ల కాలంలో చేసిన ఖర్చే రూ.1.04 లక్షల కోట్ల వరకు ఉంది. ఈ మొత్తంలో రుణాల ద్వారా చేసిన ఖర్చు రూ.28,652 కోట్ల మేర ఉంది. అందులోనూ అధికంగా కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.25 వేల కోట్లు వెచ్చించారు. 2018–19 ఆర్థిక సంవ త్సరంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.37 వేల కోట్లకుపైగా ఖర్చు చేయగా, ఇందులో రుణాలు రూ.17,194 కోట్లు. ఈ ఏడాదిలో రూ.8,476 కోట్ల బడ్జెట్‌ కేటాయించగా, రుణాల ద్వారా మరో రూ.12,302 కోట్లను ఖర్చు చేయనున్నారు. అత్యధిక శాతం రుణాల ద్వారానే ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.64 వేల కోట్లు, దేవాదుల, సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులకు రూ.17 వేల కోట్లు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్ల మేర రుణాలు సేకరించిన విషయం తెలిసిందే.  

వచ్చే ఏడాదికి 10.53 లక్షల కొత్త ఆయకట్టు 
రాష్ట్రంలో ఇప్పటికే 70.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో జలయజ్ఞం ప్రాజెక్టుల కింద 2004 నుంచి ఇంతవరకు 16.77 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు సాగులోకి రాగా, అందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.90 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. కొత్త రాష్ట్రంలో మరో 16.46 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. ఇందులో 2017–18 ఏడాదిలో కొత్తగా 2.56 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రాగా, 2018–19లో 1.78 లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తగా అందుబాటులోకి వచి్చంది. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి 10.53 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. ఇందులో దేవాదుల కింద 4 లక్షల ఎకరాలు ఉండగా, కల్వకుర్తి 1.7 లక్షల ఎకరాలు, ఎల్లంపల్లి కింద 1.70 లక్షల ఎకరాలు ఉంది. ఈ ఆయకట్టు లక్ష్యాల మేరకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.8,476 కోట్లు కేటాయించారు. మొత్తంగా అన్ని ప్రాజెక్టులు పూర్తయి ప్రభుత్వం చెప్పినట్లు 1.24 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం నెరవేరాలంటే మరో 54 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. ఇది జరగాలంటే ప్రభుత్వం మరో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.  

ప్రాజెక్టులపై ఏటా ఖర్చు చేసిన నిధులు(రూ.కోట్లల్లో
ఏడాది        ఖర్చు చేసిన నిధులు     రుణాలు 
2014–15        8,052                             – 
2015–16        10,993                           – 
2016–17        15,724                        491.33 
2017–18        25,291                     10,967.54 
2018–19        37,179                     17,194.01 
మొత్తం        97,239                       28,652.88 
( దీనికి ప్రస్తుతం ఉన్న పెండింగ్‌ బిల్లులు మరో 7,518 కోట్లు కలుపుకుంటే మొత్తంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేసిన ఖర్చు రూ.1,04,757 కోట్లు చేరనుంది.) 
   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా