ఆసరా రెట్టింపు 

29 May, 2019 02:20 IST|Sakshi

పింఛన్ల మొత్తం పెంచిన ప్రభుత్వం

దివ్యాంగులకు రూ. 1,500 నుంచి  రూ. 3,016కు పెంపు

ఇతర లబ్ధిదారులకు  రూ. వెయ్యి నుంచి రూ. 2,016కు..

జూన్‌ నుంచి పెంచిన మొత్తం అమలు

జూలై నుంచి చెల్లింపులు

సాక్షి, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూన్‌ నుంచి పెరిగిన పింఛన్లను అమలు చేయనున్నట్లు తెలిపింది. పెరిగిన పిం ఛన్ల మొత్తాలను జూలై 1 నుంచి లబ్ధిదారులకు పంపి ణీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులతో దివ్యాంగులకు నెలకు రూ. 3,016, మిగతా లబ్ధిదారులకు నెలకు రూ. 2,016 చొప్పున ప్రభుత్వం పింఛన్లు అందించనుంది. ఆదాయం పెంచాలి... పేదలకు పంచాలనేది తమ ప్రభుత్వ విధానమన్న టీఆర్‌ఎస్‌... అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఆసరా ఫించన్ల రెట్టింపును ప్రధానంగా పేర్కొంది. సామాజిక భద్రత కార్యక్రమం కింద ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. 

ఏటా సగటున రూ. 5,300 కోట్లు ఖర్చు... 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచింది. 2014 నవంబర్‌ నుంచి ఆసరా పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తోంది. దివ్యాంగులకు ప్రతి నెలా రూ. 1,500, మిగిలిన పింఛనుదారులకు ప్రతి నెలా రూ. వెయ్యి చొప్పున అందిస్తోంది. తొమ్మిది రకాల ఆసరా లబ్ధిదారులు కలిపి రాష్ట్రంలో 39,42,371 మంది ఉన్నారు. ఆసరా పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సగటున రూ. 5,300 కోట్లు ఖర్చు చేస్తోంది. ఫించన్ల మొత్తం పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ పథకం అమలు కోసం 2019–20 బడ్జెట్‌లో రూ. 12,067 కోట్లు కేటాయించింది. నిర్ణీత వార్షిక ఆదాయ అర్హత ఉంటేనే ఆసరా లబ్ధిదారులుగా అవకాశం కల్పిస్తారు. 65 ఏళ్లు నిండిన వారే వృద్ధాప్య పింఛనుకు అర్హులు. వితంతువులకు 18 ఏళ్లు నిండాలి. దివ్యాంగులకు వయసుతో సంబంధంలేదు. వృద్ధాప్య పింఛను అర్హత వయసును 58 ఏళ్లకు తగ్గించనున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. తగ్గించిన వయోపరిమితి ప్రకారం వృద్ధాప్య పింఛను లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తికాగానే కొత్త వారికి సైతం పెరిగిన పింఛను మొత్తాలను చెల్లించేలా గ్రామీణాభివృద్ధిశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 

ఆసరా పథకం లబ్ధిదారులకు అందిస్తున్న ప్రస్తుత పెన్షన్, పెరిగిన పెన్షన్‌ (రూ.లలో) 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు