అదనపు ఆదాయం ఎలా?

29 Feb, 2020 01:29 IST|Sakshi

ఆదాయ పెంపు మార్గాలపై సర్కారు కసరత్తు

ఆస్తి పన్ను 100% వసూలు చేయాలని సీఎం సూచన

పన్ను పెంపు ప్రతిపాదనలకూ నో చెప్పని కేసీఆర్‌

పరిశీలనలో విద్యుత్‌ టారిఫ్‌ పెంపు ప్రతిపాదనలు.. భూ రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ

ఈ ఏడాది మరో 20వేల కోట్లు సమకూర్చుకోవడంపై దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్వేషణ మార్గాలను వెతుక్కునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వచ్చే ఏడాది రాబడులు కూడా అం తంత మాత్రంగానే ఉంటా యనే అంచనాల నేపథ్యంలో వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్న సీఎం కేసీఆర్‌... బడ్జెట్‌ ప్రతిపాదనలకు తగినట్లు నిధులు రాబట్టుకోవడంపై దృష్టి పెట్టారు. బడ్జెట్‌ తయారీ సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సలహాదారు జీఆర్‌ రెడ్డి తదితరులతో బడ్జెట్‌ రూపకల్పనపై నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన ఈ మేరకు చర్చిస్తున్నారు. బడ్జెట్‌ నిర్వహణకు అడ్డంకులు కలగకుండా ఉండేందుకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అం దులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి పన్ను పెంపు అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంచడం ద్వారా స్థానిక సంస్థలకు సర్దుబాటు చేయాల్సిన నిధుల్లో వెసులుబాటు వస్తుందనే చర్చ జరిగింది. పల్లెలు, పట్టణాల్లో ప్రగతి పేరుతో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణతోపాటు పలు అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టి ఠంచన్‌గా నెలవారీ నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత రాకపోవచ్చనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. అయితే పన్ను పెంచడమా లేక లీకేజీలు లేకుండా పన్ను 100 శాతం వసూలు చేయడమా అనే అంశంపైనా చర్చ జరిగింది. గ్రామ పంచా యతీల విషయానికి వస్తే రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట, మంచిర్యాల లాంటి జిల్లాలు మినహా మిగిలిన చోట్ల ఇంటి పన్ను నామమాత్రంగానే వసూలవుతోందని, ఈ పన్నును సజావుగా రాబట్టుకోవడం ద్వారా ఏటా రూ.200 కోట్ల వరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది.

పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, లీకేజీలు అరికట్టడమే లక్ష్యం గా గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను వసూలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కొంత ఆర్థిక భారం తగ్గించుకోవచ్చనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆస్తిపన్ను ప్రతి పాదనను సీఎం తోసిపుచ్చలేదని కూడా సమాచా రం. ఇక విద్యుత్‌ టారిఫ్‌ పెంపు అంశాన్నీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాధారణ కేటగిరీలో ఉండే ప్రజలకు భారం పడకుండా విద్యుత్‌ చార్జీల ను పెంచుకోవడం ద్వారా డిస్కంలకు చెల్లించాల్సిన మొత్తం నుంచి ప్రభుత్వానికి ఊరట కలుగుతుం దని, విద్యుత్‌ సబ్సిడీల రూపంలో ఇస్తున్న దాంట్లో దాదాపు రూ. 2 వేల కోట్ల భారం తగ్గించుకోవచ్చనే భావనతో త్వరలోనే చార్జీల పెంపునకు సీఎం కేసీఆర్‌ పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది.

భూముల విలువలు సవరిస్తే...!
ఇక భూముల రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ అంశం కూడా ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం చర్చించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలోని భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించలేదు. కారణమేదైనా రెండేళ్లకోసారి సవరించాల్సిన ఈ ధరలు ఆరేళ్లయినా మార్చలేదు. దీంతో ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ. వేల కోట్లలోనే ఆదాయం కోల్పోతోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతోపాటు భూముల విషయంలో ప్రజల అభిప్రాయం కూడా రిజిస్ట్రేషన్‌ విలువల సవరణకు అనుకూలంగానే ఉంటుందనే చర్చ ఈ సమావేశంలో జరిగింది. దీంతో ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించాలని తద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా నెలవారీ వచ్చే అదనపు ఆదాయంతో నెలవారీగా వచ్చే ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతోపాటు గతేడాది ప్రతిపాదించిన విధంగానే మరోమారు భూముల అమ్మకాలను కూడా ప్రతిపాదించాలనే దానిపైనా ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చర్చించారు.

ఈ ఏడాది కొత్తగా ఆపద్బంధు పథకం, కుట్టు మిషన్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండడంతోపాటు నెలనెలా పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూ. 500 కోట్ల వరకు అవసరం అవుతున్నందున ఖజానాకు లోటు రాకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవసరానికి తగినట్లు భూముల విక్రయాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 10–12 వేల కోట్ల వరకు ఆదాయాన్ని రిజర్వు చేసుకోవాలని, మిగిలిన మార్గాల్లో కలిపి మొత్తం రూ. 20 వేల కోట్లను అదనంగా అందుబాటులో ఉంచుకొనే విధంగా ముందుకెళ్లాలని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు