వెంకయ్యకు ఘనంగా పౌరసన్మానం

21 Aug, 2017 12:54 IST|Sakshi
వెంకయ్యకు ఘనంగా పౌరసన్మానం

హైదరాబాద్‌: ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తెలుగు నేత ఎం. వెంకయ్య నాయుడుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఘనంగా పౌరసన్మానం నిర్వహించింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ వేడుకలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా వెంకయ్యనాయుడును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, గవర్నర్‌ నరసింహన్‌ సన్మానించారు. ఈ కార్యక్రమానికి సీఎం, గవర్నర్‌తోపాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. వెంకయ్యనాయుడు అద్భుతమైన వక్త అని కితాబిచ్చారు. ఆయన గురించి తెలియని వారు ఎవరూ లేరని, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నతస్థానానికి ఆయన వచ్చారని చెప్పారు. '80లలో నేను వెంకయ్యనాయుడును తొలిసారి చూశాను. విద్యార్థి దశ పూర్తిచేసుకొని నేను విప్లవ రాజకీయాలవైపు ఆలోచిస్తున్న సందర్భం అది. ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం సుబ్రహ్మణ్యస్వామితో కలిసి వెంకయ్యనాయుడు సిద్దిపేట వచ్చారు. అప్పుడు తొలిసారి ఆయన ఉపన్యాసాన్ని విన్నాను. మొదట్లో ఆయన ఉపన్యాసంలో వ్యంగ్యం ఎక్కువ కనిపించేది. కానీ ఆ తర్వాత ఆయన ఉపన్యాసంలో వ్యంగ్యం, రౌద్రం, హాస్యం, లాలన పూరితమైన సామరస్యం అన్ని సమపాళ్లలో కనిపించి శ్రోతలను అలరించాయి. ఆయన గొప్ప వక్త ఎదుగడం వెనుక ఎంతో కృషి ఉంది' అని కేసీఆర్‌ అన్నారు. వెంకయ్యనాయుడు గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి అని, ఆయనను గౌరవించుకునే ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సన్మాన వేడుక అనంతరం దిల్‌కుషా అతిథి గృహ ప్రాంగణంలో వెంకయ్యనాయుడకు విందు ఏర్పాటు చేశారు.