పురాతన ఆలయాల అభివృద్ధికి నిధులు

27 Feb, 2017 12:31 IST|Sakshi
పురాతన ఆలయాల అభివృద్ధికి నిధులు

హర్షం వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్‌ నేతలు
మనోహరాబాద్‌ : ఎంతో ప్రాశస్త్యం ఉన్న కూచారం ఆంజనేయస్వామి ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.22.60 లక్షల నిధులు మంజూరు చేయడంపై స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కూచారం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద గ్రామ సర్పంచ్‌ మజ్జతి  విఠల్‌ యాదవ్, మండల టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు వంగ రమేష్‌గౌడ్, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మోంగ్యా నాయక్, ఆలయ పూజారి వేణుగోపాల్‌శర్మ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి ,ఆలయాల ప్రగతిని కాంక్షించే సీఎం.. కూచారం గుడికి నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు.

రామలింగేశ్వర ఆలయానికి 70 లక్షలు
తూప్రాన్ : తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌ గ్రామ సమీపంలోని రామలింగేశ్వర ఆలయ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.70 లక్షల నిధులు మంజూరు చేసిందని టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి (రాజు) ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి ఆలయం సనాతనమైన దేవాలయమన్నారు.  శ్రీరాముడు అరణ్యవాసం వెళ్లిన సందర్భంలో ఈ ఆలయం వద్ద సేదతీరినట్లుగా పురాణాలు ఉన్నాయన్నారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం కావడంతో  భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు.  ఈ క్రమంలోనే ఆలయాన్ని  తీర్చిదిద్దేందుకు  ప్రభుత్వం రూ.70 లక్షలు మంజూరు చేసిందన్నారు. నిధులు మంజూరు చేసినందుకు  సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి   కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు