పకడ్బందీగా ప్రయోగం 

31 Jan, 2019 09:09 IST|Sakshi

గుడిహత్నూర్‌(బోథ్‌): ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగ కసర త్తు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సారి ప్రాక్టికల్‌ పరీక్షలకు అరగంట ముందు మాత్రమే ఇంటర్మీడియెట్‌ బోర్డు నుంచి ప్రశ్నపత్రం ఆన్‌ద్వారా పరీక్షా కేంద్రాలకు అందనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 5,927 మంది విద్యార్థులు ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ వారు 1,884 మంది, బైపీసీ వారు 3,388 ఉండగా వొకేషనల్‌ విద్యార్థులు 655 మంది ఉన్నారు. వీరందరూ ప్రాక్టికల్‌ పరీక్షల్లో హాజరుకావడానికి యంత్రాం గం అన్ని విధాల చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రాక్టికల్‌ పరీక్షలంటే మాములుగా తీసుకునే విద్యార్థులు మాత్రం నష్టపోయే అవకాశం ఉంది. ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.  
ఆన్‌లైన్‌ ద్వారా అందనున్న ప్రశ్నపత్రం 
ప్రాక్టికల్‌ పరీక్షలను ప్రశాంత  వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ పటిష్ట ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది పరీక్షా సమయానికి అరగంట ముందు ఎగ్జామినర్‌కు ఇంటర్మీడియెట్‌ బోర్డు నుంచి ఆన్‌లైన్‌లో ప్రశ్న పత్రం అందనుంది. అందిన వెంటనే ఎగ్జామినర్లు దానిని ప్రింట్‌ తీసుకొని పరీక్షా సమయానికి విద్యార్థులకు అందించనున్నారు. అయితే ఈ పరీక్షలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.

ప్రాక్టికల్స్‌ గట్టెక్కేనా? 
జిల్లాలో 30 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతోపాటు 18 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. అయితే ద్వితీయ సంవత్సరం చదువుకుంటూ ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల్లో ప్రాక్టికల్‌ భయం పుడుతోంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆగస్టు నుంచి ప్రాక్టికల్స్‌ ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో సెలబస్‌ పూర్తికానట్లు తెలుస్తోంది. దసరా సెలవులు, ఎన్నికలు, సంక్రాంతి సెలవులతోపాటు అధ్యాపకులు ఎన్నికల విధులు తదితర కారణాల వల్ల సకాలంలో అందుబాటులో ఉండకపోవడం సైతం కారణంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో పూర్తి స్థాయిలో ప్రాక్టికల్స్‌కు సంబంధించి సామగ్రి లేకపోవడంతో మొక్కుబడిగా చేయించి థియరీ మాత్రం బట్టీ పట్టించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సారి ప్రాక్టికల్స్‌లో విద్యార్థులు ఎలా గట్టెక్కుతారనే ఆందోళన కనిపిస్తోంది.  

పకడ్బందీగా నిర్వహిస్తాం 

ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం. దీనికిగాను అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కళాశాలల్లో 95శాతం ప్రాక్టికల్‌ బోధన పూర్తయింది. సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా బోధన పూర్తి చేయడంతో పాటు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటాం.  – దస్రు, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి ఆదిలాబాద్‌  

మరిన్ని వార్తలు