చలో ‘గోదావరి’

14 Jan, 2019 11:10 IST|Sakshi
తలసానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

గోదావరి జిల్లాలకు నగర నేతలు  

సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు..  

మరోవైపు పందెం రాయుళ్లు సైతం   

సాక్షి,సిటీబ్యూరో: పట్నం బోసిపోయింది. నిత్యం అత్యంత రద్దీగా కనిపించే దారులన్నీ ఆదివారం వెలవెలబోయాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్‌ వారితో పాటు తెలంగాణ జిల్లాల పల్లెలకు సంక్రాంతి ప్రయాణాలు భారీగానే సాగాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొనడం ఓ కారణమైతే... ఆంధ్రాకు మాత్రం పండగ సెంటిమెంట్‌ నగరవాసులను క్యూ కట్టించింది. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికలు, విజయోత్సవ సభలతో ఫుల్‌ బిజీగా గడిపిన నగర ఎమ్మెల్యేలు ఈసారి తమ నియోకజవర్గంలో స్థిరపడ్డ ఏపీ మిత్రులతో కలిసి సంక్రాంతి సంబరాలకు వెళ్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భీమవరంలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. వీరితో పాటు నగరంలో పలువురు కార్పొరేటర్లు సైతం ఆంధ్రాబాట పట్టారు. ఇదిలావుంటే నగరం నుంచి భారీ ఎత్తున పందెం రాయుళ్లు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పయనమయ్యారు. గతంలో మాదిరిగా ఈ ఏడు కూడా నగరంలోని బార్కాస్‌ నుంచి ఆంధ్రా జిల్లాలకు పందెం కోళ్లు భారీ ఎత్తున ఎగుమతి అయ్యాయి. బార్కాస్‌లో పందెం కోసమే పెంచడంతో పాటు వాటికి ప్రత్యేక తర్ఫీదునిచ్చిన శిక్షకులు సైతం వారి వెంట వెళ్తున్నారు.

తలసాని పర్యటన ఇలా...
సనత్‌నగర్‌: మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సంక్రాంతి సంబరాలకు హాజరు కానున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం 7గంటలకు నగరం నుంచి రోడ్డు మార్గంలో ఆయన ఏపీకి బయలుదేరుతారు. 10గంటలకు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఇంద్రకీలాద్రి వరకు వెళ్తారు. 10:30 గంటలకు కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడ నుంచి భీమవరం చేరుకుంటారు. అక్కడి ప్రసిద్ధ మావురాలమ్మను దర్శించుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. భీమవరంలో 15న జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అక్కడి అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం.     

మరిన్ని వార్తలు