గల్ఫ్‌ కన్నీళ్లు ఇంకెన్నాళ్లు?

24 Sep, 2017 02:05 IST|Sakshi

నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోతున్న తెలంగాణ యువత

తెలంగాణలో గల్ఫ్‌ మాయాజాలం మళ్లీ మొదలైంది. 
పొట్టచేతబట్టుకొని ఎడారి దేశాలకు వెళ్లి మోసపోతున్న వలస జీవుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. బోగస్‌ ఏజెంట్లు.. నకిలీ వీసాలు, విజిట్‌ వీసాలు అంటగట్టి ఎన్నో కుటుంబాలను నట్టేట ముంచుతున్నారు. గల్ఫ్‌ బాధితులకు అండగా ఉండేందుకు ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ పాలసీ తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించినా ఆ దిశగా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా గల్ఫ్‌ కన్నీటి గాథలు రోజుకోచోట వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు పది లక్షల మంది తెలంగాణవాసులు గల్ఫ్‌ దేశాల్లో ఉన్నట్లు అనధికార లెక్కలున్నాయి. వీరికి తోడు.. ప్రతిరోజూ పదుల సంఖ్యలో  ఆ దేశాలకు పయనమవుతున్నారు. ఉన్న ఊరిలో పని దొరక్కపోవటం.. అక్కడికి వెళ్తే ఏదో ఓ పని చేసుకోవచ్చనే మొండి ధైర్యం.. ఇక్కడ ‘రూపాయి’ కష్టానికి అక్కడ పది రూపాయలొస్తాయనే ఆశలు.. తెలంగాణ యువతను గల్ఫ్‌ బాట పట్టేలా ప్రేరేపిస్తున్నాయి. వీరి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ నకిలీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పెరిగిపోతున్న వీరి ఆగడాలు, ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలు, ఎన్‌ఆర్‌ఐ పాలసీపై ఫోకస్‌...     
– బొల్గం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి

గల్ఫ్‌ దేశాల్లో ఉపాధితోపాటు పాస్‌పోర్టులు మొదలు వీసాలు, టికెట్ల సేవలందించేందుకు తెలంగాణలో దాదాపు 2,800 మంది ఏజెంట్లున్నారు. వీరిలో 2,772 మంది బోగస్‌ ఏజెంట్లే. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్‌డ్‌ కంపెనీలు కేవలం 28. అందులో రెండు ప్రభుత్వ ఏజెన్సీలే. అవి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓవర్‌సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ (ఓమ్‌కాం), తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్‌సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ (టామ్‌కాం). వీటితోపాటు మరో 26 కంపెనీలకు మాత్రమే ఈ లైసెన్స్‌ ఉంది. లైసెన్స్‌ ఉన్న కంపెనీలను మాత్రమే ఆశ్రయించాలనే ప్రచారం లేకపోవటంతో వలస జీవులు బోగస్‌ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు. చిన్న చిన్న కంపెనీలు పంపే వీసాలు, విజిట్‌ వీసాలు చూపించి ఏజెంట్లు అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ‘విజిట్‌ వీసాలతో వెళ్తే.. అక్కడేదైనా పని వెతుక్కోవచ్చు.. తిరిగి వచ్చేటప్పుడు రెండుమూడు రోజులు జైల్లో ఉంటే వాళ్లే పంపిస్తారు..’ అని మాయమాటలు చెప్పి సాగనంపుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక వీసాలు చెల్లక.. పని దొరక్క.. దొరికినా ఇక్కడ ఏజెంట్లు చెప్పిన జీతానికి అక్కడ ఇచ్చే జీతానికి పొంతన లేక వలసజీవులు చిత్తవుతున్నారు. తిరిగి సొంత దేశానికి రాలేక నానా అవస్థలు పడుతున్నారు. 

లైసెన్స్‌ ఉంటే పక్కాగా.. 
విదేశాల్లో ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలు విధిగా కేంద్ర విదేశాంగ శాఖ లైసెన్స్‌ పొంది ఉండాలి. కేంద్రం వద్ద రూ.50 లక్షలు డిపాజిట్‌ చేయాలి. వారికి అనుమతించిన పరిధిలోనే నియామకాలు జరపాలి. ఉద్యోగ వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి. వీటిని పాటించని కంపెనీలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం వాళ్ల డిపాజిట్‌ను జప్తు చేస్తుంది. లైసెన్స్‌ రద్దవుతుంది. కానీ స్థానికంగా పోలీసు, రెవెన్యూ విభాగాలు నకిలీ ఏజెంట్లు బహిరంగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నా, ప్రకటనలు జారీ చేస్తున్నా కఠినంగా వ్యవహరించటం లేదు. 

సిరిసిల్ల జిల్లా ఒక్కటే ఆదర్శం 
గల్ఫ్‌ మోసాలు, బాధితుల సంఖ్య పెరిగిపోవటంతో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం బోగస్‌ ఏజెంట్ల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల నుంచి గల్ఫ్‌ వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. అందుకే లైసెన్స్‌ లేని ఏజెంట్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అక్కడి పోలీస్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో సిరిసిల్ల జిల్లాలో పోలీసు యంత్రాంగం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించింది. లైసెన్స్‌ లేని ఏజెంట్లందరినీ బైండోవర్‌ చేసి.. గల్ఫ్‌ వీసాలు ఇప్పించే ట్రావెల్‌ ఏజెన్సీలన్నీ మూసేయించింది. మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ ముందుకుసాగలేదు. దీంతో క్రమంగా ఈ చర్య అడ్డదారులకు తావిచ్చింది. ఇప్పుడు సిరిసిల్ల ప్రాంతంలోని ఏజెంట్లు ఇతర జిల్లాలకు వెళ్లి వీసాలు అమ్ముకుంటూ తమ దందాను ఎప్పట్లాగే కొనసాగిస్తున్నారు. 

కేటీఆర్‌పైనే ఆశలు.. 
ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దాని బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు అప్పగించింది. దీంతో గల్ఫ్‌లో ఉన్న తెలంగాణవాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. నకిలీ ఏజెంట్లను అరికట్టడంతోపాటు మృతదేహాల తరలింపు, పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియా తదితర అంశాలతో ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపొందిస్తామని మంత్రి ప్రకటించారు. గల్ఫ్‌లో తెలంగాణవారి సంక్షేమానికిపాటు పడే సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులతో ఎన్‌ఆర్‌ఐ పాలసీ ముసాయిదా తయారీకి గతేడాది జూలై 27న ప్రత్యేకంగా సదస్సు నిర్వహించారు. కానీ ఇప్పటికీ ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించకపోగా.. సదస్సులో వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు అమలుకు నోచుకోలేదు. పత్రికల్లో వచ్చే వార్తలు, బాధితుల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు గల్ఫ్‌ జైళ్లలో చిక్కుకున్న వారు, మృతదేహాలను స్వదేశాలకు రప్పించేందుకు పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవటం తప్ప.. విధాన ప్రకటన దిశగా చర్యలు తీసుకోవడం లేదు. 

తెల్లకార్డుకు మృతదేహానికి లింక్‌ 
సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఒమన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌తోపాటు సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో ప్రమాదాలు, ఆత్మహత్యలు, వివిధ కారణాలతో ఏటా దాదాపు 200 మందికిపైగా తెలంగాణవాసులు చనిపోతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గల్ఫ్‌ దేశాలలో దాదాపు 540 మంది చనిపోయారు. వారిలో కొందరికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించగా.. స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని మృతదేహాలు నెలల తరబడి నిరీక్షించిన తర్వాత స్వదేశానికి చేరాయి. మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కొంతకాలంగా బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నా ఇప్పటికీ నెరవేరలేదు. విదేశాల నుంచి వచ్చే మృతదేహాలను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుతో ముడిపెట్టింది. ఈ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉచిత అంబులెన్స్‌ సౌకర్యం కల్పిస్తోంది. ఈ నిబంధనను సడలించి అందరికీ అంబులెన్స్‌ సదుపాయం కల్పించాలని, ఎయిర్‌పోర్ట్‌లో గల్ఫ్‌కు సంబంధించి హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వివిధ సంఘాలు విజ్ఞప్తి చేసినా అమలుకు నోచుకోలేదు. 

కామ్‌గా.. టామ్‌కాం
 
నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేయటంతోపాటు గల్ఫ్‌లో ఉపాధి అవకాశాలకు తెలంగాణలోని యువతను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రెండేళ్ల కిందట టామ్‌కాం ఏజెన్సీని ఏర్పాటు చేసింది. గల్ఫ్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని.. ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టామ్‌కాం క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంది. జిల్లాల్లోని ఉపాధి కల్పన కేంద్రాలు, ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న యువతకు టామ్‌కాం ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి వీసాలు ఇప్పించాలి. దాదాపు 30 వేల మంది యువకులు ఇప్పటికే టామ్‌కాంలో రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే సంస్థ క్రియాశీలంగా వ్యవహరించకపోవటంతో నకిలీ ఏజెంట్లు చెలరేగిపోతున్నారు. గడిచిన రెండేళ్లలో దాదాపు 2 వేల మందిని గల్ఫ్‌కు పంపించినట్లు ఈ ఏజెన్సీ చెబుతున్నా.. వారిని కూడా ప్రైవేటు ఏజెన్సీల ద్వారానే పంపించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకూ ఈ వెబ్‌సైట్‌ను సైతం అప్‌డేట్‌ చేయలేదు. ఇటీవల నల్లగొండ జిల్లాకు చెందిన బోయపల్లి రంగారెడ్డిని ప్రభుత్వం టామ్‌కాంకు చైర్మన్‌గా నియమించింది. గల్ఫ్‌ వలసలు తక్కువగా ఉండే ప్రాంతం నుంచి ఈ నియామకం చేపట్టడం కూడా గల్ఫ్‌ బాధిత వర్గాల్లో చర్చకు తెరదీసింది. 

గల్ఫ్‌లో ఉన్నవారెందరు? 
తెలంగాణ నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన వారెందరన్న వివరాలు ప్రభుత్వం దగ్గర కూడా పక్కాగా లేవు. దాదాపు 8 లక్షల మంది నుంచి 10 లక్షల మంది ఉన్నట్లు గల్ఫ్‌ తెలంగాణ వెల్ఫేర్‌ అండ్‌ కల్చర్‌ అసోసియేషన్‌తోపాటు గల్ఫ్‌లో తెలంగాణవాసుల సంక్షేమానికి పని చేసే సంఘాలు చెబుతున్నాయి. పలు ఏజెన్సీల లెక్క కూడా ఇంచుమించు ఇంతే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య 97 వేలు మాత్రమే అని తేలింది. ఓటుహక్కు, రేషన్‌ కార్డు, ప్రభుత్వ పథకాలు కత్తిరిస్తారనే భయంతో గల్ఫ్‌కు వెళ్లిన వారి కుటుంబీకులు సర్వేకు వచ్చిన బృందాలకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకే ఈ సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందనే వాదనలున్నాయి. అందుకే రాష్ట్రం నుంచి విదేశాలకు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించడానికి మరో సమగ్ర సర్వే నిర్వహించాల్సి ఉంది. ఈ సర్వే ఖర్చులో సగం భరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ సర్వేతో వలసకు కారణాలు, సామాజిక, ఆర్థిక కోణం, వలస వెళ్ళిన వారి సంఖ్య, వారి విద్యార్హతలు, సాంకేతిక పరిజ్ఞానం, వయసు, ఏయే దేశాలకు ఏయే జిల్లాల వారు వెళ్తున్నారనే విషయాలు తెలుస్తాయి. ఈ సర్వే ఆధారంగా ఎన్‌ఆర్‌ఐ పాలసీ, భవిష్యత్‌ ప్రణాళికలు పక్కాగా తయారు చేసే అవకాశం ఉంటుంది. 

ఆత్మహత్యలు పెరుగుతున్నాయి
గల్ఫ్‌లో విపత్కర పరిస్థితులున్నాయి. తెలంగాణ వచ్చాక తమకు భరోసా ఉంటుందనే ధీమా ప్రవాసీయుల్లో సడలుతోంది. ఇటీవల ఆత్మహత్యలు చేసుకునే సంఖ్య పెరిగిపోయింది. 2009లో ఇలాంటి పరిస్థితి ఉండేది. క్యాంపులకు వెళ్లి కౌన్సెలింగ్‌ చేస్తున్నాం. ఇటీవలే ఇద్దరు సిరిసిల్ల ప్రాంతానికి చెందిన యువకులు కంపెనీ వీసా అని మోసపోయి విజిట్‌ వీసాతో గల్ఫ్‌కు వెళ్లి ఇబ్బందుల్లో పడ్డారు. గత నెలలోనే 14 మంది జగి త్యాలæ ప్రాంత వాసులు ఓ ఏజెంట్‌ను నమ్మి కంపెనీ వీసా ఇప్పిస్తామంటే దుబాయ్‌కి విజిట్‌ వీసాపై వెళ్లారు. అక్కడికెళ్లాక ఇరుకైన గదిలో ఉంచి ఇబ్బందుల పాల్జేశారు. తిరిగి వెళ్దామంటే వీసా టైం అయిపోయింది. రిటర్న్‌ టికెట్‌ లేదు. పాస్‌పోర్టు లేదు. విజిట్‌ వీసాలు వేరు. ఉద్యోగ వీసాలు వేరు. ఏజెంట్ల మాయమాటలు నమ్మకండి. లెసైన్స్‌డ్‌ ఏజెన్సీలు నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా వెళితే ఉపాధికి గ్యారంటీ ఉంటుంది. లైసెన్స్‌ లేని ఏజెంట్లను పోలీసులకు పట్టించండి. గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అండగా ఉండేలా ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీని రూపకల్పన చేయాలి. ఏటా బడ్జెట్‌లో రూ.100 కోట్లు  కేటాయించాలి. టామ్‌కాం కార్యకలాపాలను విస్తరించి నిరుద్యోగులకు చేరువ చేయాలి
– జువ్వాడి శ్రీనివాసరావు, తెలంగాణ గల్ఫ్‌ వెల్ఫేర్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

బ్రోకర్లను నియంత్రిస్తాం
గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కొన్ని ఏజెన్సీలు పెద్ద మొత్తంలో దండుకుంటున్నాయి. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పుచ్చుకుని విదేశాలకు పంపుతున్నాయి. అక్కడ ఉద్యోగం దొరి కిందా సరే.. లేకుంటే అంతే సంగతి. బ్రోకర్‌ సంస్థల ఆటలను కట్టడి చేసేందుకే టామ్‌కాం ఏర్పాటు చేశాం. ప్రభుత్వం తర ఫున ఎంపికై వెళ్లడమే శ్రేయస్కరం. త్వరలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తున్నాం.     
– బోయపల్లి రంగారెడ్డి, టామ్‌కాం చైర్మన్‌ 

త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్‌
ఓవర్సీస్‌లో పనిచేసేందుకు అభ్యర్థుల నుంచి డిమాండ్‌ ఉన్నా రిజిస్ట్రేషన్‌ పెరగడం లేదు. ప్రస్తుతం టీఎస్‌ ఆన్‌లైన్‌ కేంద్రా ల్లోనే రిజిస్ట్రేషన్‌ సౌకర్యం ఉంది. త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పటివరకు 79 మందికి గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాం. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా గల్ఫ్‌దేశాల్లో ఉద్యోగం పొందడమే మంచిది. టామ్‌కామ్‌ సంస్థపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తాం. ఈ మేరకు జిల్లాల్లో ఉన్న ఉపాధి కల్పన అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రతి జిల్లాలో మైగ్రేట్‌ రిసోర్స్‌ కేంద్రాలను తెరుస్తాం. గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న వారి వివరాలను అందులో నమోదు చేస్తాం. అక్కడ డిమాండ్‌ ఉన్న కొలువులకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నాం.    
– కేవై నాయక్, టామ్‌కాం మేనేజింగ్‌ డైరెక్టర్‌ 

నకిలీ వీసాతో మోసం
నేను డిగ్రీ వరకు చదువుకున్న. భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. ఊళ్లో భూమి లేదు. కొన్నేళ్లుగా కూలీ పనులు చేసి బతుకుతున్న. వచ్చే కూలీతో మా కుటుంబం గడవడం కష్టంగా మారింది.  నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం నర్సింహులపల్లెలో ఓ మహిళా ఏజెంట్‌ పరిచయమైంది. ఖతార్‌లో మంచి పని, వేతనం ఉందని చెప్పింది. నా తల్లి, భార్య వద్ద ఉన్న  బంగారం తాకట్టు పెట్టి రూ.70 వేలు తెచ్చి కట్టిన. 15 రోజుల్లోగా ఖతార్‌కు పంపిస్తానని చెప్పి నకిలీ వీసా, నకిలీ ఫ్లైట్‌ టికెట్‌ ఇచ్చి మోసం చేసింది. డబ్బులు, పాస్‌పోర్టు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. 
– వంగపెల్లి భూపతి, కనగర్తి, కోనరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా

డబ్బులు మిత్తికి తెచ్చిన..
నేను తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన. కూలీకి పోతే కుటుంబం గడుస్తలేదు. అందుకే గల్ఫ్‌ పోదామనుకున్న. మా గ్రామానికి చెందిన మల్లేశం ద్వారా ప్రమీల అనే ఏజెంట్‌కు డబ్బులు కట్టిన. ఖతార్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తమన్నరు. రెండ్రూపాయల మిత్తికి రూ.70 వేలు తెచ్చి ముట్టజెప్పిన. పాస్‌పోర్టు కూడా ఇచ్చిన. కానీ నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేశారు. ఇప్పుడు ఏజెంట్, మధ్యవర్తి తప్పించుకు తిరుగుతుండ్రు.     
– రావులపెల్లి మల్లారెడ్డి, కనగర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లా

గల్ఫ్‌ బాధితుల విజ్ఞప్తులివీ.. 

  • కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇన్సూరెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టాలి. విదేశాలకు వెళ్లే కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్‌ సౌకర్యాలు కల్పించాలి 
  • విదేశాలకు వలస వెళ్లే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రవాసీ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వలస వెళ్లే కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చైతన్య సదస్సులు నిర్వహించాలి 
  • మోసపోయి తిరిగొచ్చిన వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి. వారి అనుభవాన్ని, వృత్తి నైపుణ్యాన్ని వినియోగించుకోవాలి. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) కేంద్రాలను బలోపేతం చేయాలి. నైపుణ్య శిక్షణా  కేంద్రాలను ప్రతి సబ్‌ డివిజన్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి 
  • సచివాలయంలోని ఎన్నారై సెల్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలి 
  • వలసవెళ్లిన వారి పేర్లను రేషన్‌ కార్డుల నుంచి తొలగించొద్దు. మానవ అక్రమ రవాణాను అరికట్టాలి. రిక్రూటింగ్‌ వ్యవస్థపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలి. ఏజెంట్లను నియంత్రించాలి. విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేసి, వారి విడుదలకు కృషి చేయాలి 
  • విదేశాల్లోని భారతీయుల కోసం తక్షణం స్పందించే ఆన్‌లైన్‌ వ్యవస్థ ’మదద్‌’ (కాన్సులార్‌ సర్వీసెస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) ఉంది. ఇదే తరహాలో గల్ఫ్‌ కుటుంబాలకు సాయమందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 
  • కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ పెన్షన్‌ సిస్టం (ఎన్‌పీఎస్‌)లో ప్రవాస భారతీయులందరూ చేరవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన సదస్సులు, ప్రచారం నిర్వహించాలి.
మరిన్ని వార్తలు