పోరాడి ఓడిన సిక్కి–ప్రణవ్‌ జంట | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సిక్కి–ప్రణవ్‌ జంట

Published Sun, Sep 24 2017 1:08 AM

Sikki Reddy and Pranaav Jerry Chopra achieve unique record

టోక్యో: కెరీర్‌లో తొలిసారి ఓ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరాలని ఆశించిన సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) జంటకు నిరాశ ఎదురైంది. జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఈ భారత జోడీ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా ద్వయం 21–14, 15–21, 19–21తో టకురో హోకి–సయాకా హిరోటా (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో గెలిచిన భారత జోడీ ఆ తర్వాత అదే జోరును కనబర్చలేకపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం రెండు జోడీలు ఆరంభం నుంచి ప్రతీ పాయింట్‌ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. 7–8తో ఒక పాయింట్‌తో వెనుకబడిన దశలో జపాన్‌ జోడీ వరుసగా మూడు పాయింట్లు గెలచి 10–8తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యం 13–9గా మారింది. నాలుగు పాయింట్లతో వెనుకబడిన దశ నుంచి భారత జంట కోలుకోలేకపోయింది. స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఒకట్రెండు పాయింట్ల ఆధిక్యాన్ని జపాన్‌ ద్వయం చివరిదాకా నిలబెట్టుకొని విజయాన్ని దక్కించుకుంది. సెమీస్‌లో ఓడిన సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంటకు 4,550 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 94 వేలు)తోపాటు 6,420 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

సింగిల్స్‌ ఫైనలో లీ చోంగ్‌ వీ, అక్సెల్‌సన్‌
మరోవైపు ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌), మాజీ నంబర్‌వన్‌ లీ చోంగ్‌ వీ (మలేసియా) ఫైనల్లోకి అడుగు పెట్టారు. సెమీస్‌లో అక్సెల్‌సన్‌ 21–16, 21–16తో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)పై, లీ చోంగ్‌ వీ 21–19, 21–8తో షి యుకి (చైనా)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌), హి బింగ్‌జియావో (చైనా) టైటిల్‌ పోరుకు అర్హత సాధించారు. మారిన్‌తో జరగాల్సిన తొలి సెమీఫైనల్లో గాయం కారణంగా ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌) ‘వాకోవర్‌’ ఇవ్వగా... రెండో సెమీఫైనల్లో హి బింగ్‌జియావో 21–14, 25–23తో చెన్‌ యుఫె (చైనా)పై గెలిచింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement