హత్య కేసులో నిందితుల అరెస్ట్

28 Dec, 2014 01:39 IST|Sakshi
హత్య కేసులో నిందితుల అరెస్ట్

తొర్రూరు : నర్సింహులపేట మండలంలోని గుండంరాజుపల్లిలో ఈ నెల 22న జరిగిన నీరటి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తొర్రూరు సీఐ సార్ల రాజు నిందితుల వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గుండంరాజుపల్లికి చెందిన కుంట రాములు ఆ గ్రామ చెరువు అసలు నీరటికాడిగా పనిచేస్తుండేవాడు. కాగా ప్రస్తుతం రాములుకు బదులు అతడి కుమారుడు యాదగిరి నీరటికాడిగా పనిచేస్తున్నాడు. కాగా ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వచ్చే జీతం డబ్బుల విషయమై కుంట సురేష్, వారి బంధువు చిల్ల ఉప్పలయ్య తరచూ గొడవపడుతుండేవారు.

నీరటికాడి వాటా విషయంలో తండ్రీకొడుకులైన రాములు, యాదగిరి తమకు అడ్డుపడుతున్నారని, ఎలాగైన వారిని హతమర్చాలని సురేష్, ఉప్పలయ్య కుట్ర పన్నారు. ఈ నెల 22న రాములు కుమారుడు యాదగిరి(45) చెరువు వద్దకు వెళ్లగా సురేష్, ఉప్పలయ్య కూడా వెళ్లి గొడ్డలితో అతడి మెడపై నరికారు. తీవ్రగాయాలతో రక్తపుమడుగులో యాదగిరి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో శనివారం ఉదయం దంతాలపల్లిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా సురేష్, ఉప్పులయ్య అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో వారిద్దరిని అరెస్టు చేశామని, కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట నర్సింహులపేట ఎస్సై అరాఫత్ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు