సంతోషాన్ని చిదిమిన విషాదం

31 Jan, 2016 23:03 IST|Sakshi
సంతోషాన్ని చిదిమిన విషాదం


 మొమిన్‌పేట: విధి ఆడిన వింత నాటకానికి నలుగురు బలైపోయారు. వేడుక జరిగిన కొన్నిగంటల్లోనే విషాదం జరిగి కానరాని లోకాలకు తరలివెళ్లారు. సరదాగా చెరువులోకి షికారుకు వెళ్లగా పడవబోల్తాపడి దుర్మరణం పాలయ్యారు. తమ కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చారు. కొడుకు పురుడి వేడుకకు వచ్చిన తండ్రి, తోడల్లుడితో పాటు ఓ తండ్రీకొడుకు మృత్యువాత పడిన హృదయ విదారక సంఘటన మోమిన్‌పేట మండల పరిధిలోని దేవరంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వికారాబాద్ సీఐ రవి, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కర్రొళ్ల సుందరయ్య, ఏసమ్మ దంపతులకు కుమార్తెలు సువర్ణ, జ్యోతి ఉన్నారు. సువర్ణను మెదక్ జిల్లా కొండాపూర్‌కు చెందిన జంగిలి బాలకృష్ణ(28) ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.

జ్యోతికి అదే జిల్లా కొండాపూర్ మండలం కొనాపూర్‌కు చెందిన సుభాన్(26)తో నాలుగేళ్ల క్రితం పెళ్లి అయింది. ఇదే గ్రామానికి చెందిన వెంకటయ్య(35) బాలకృష్ణకు బావ. ఇదిలా ఉండగా, బాలకృష్ణ, సువర్ణ దంపతులకు 20 రోజుల క్రితం మొదటి సంతానంగా కుమారుడు పుట్టాడు. పురుడు కార్యక్రమం శనివారం రాత్రి దేవరంపల్లిలో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు తోడల్లుళ్లు బాలకృష్ణ, సుభాన్‌తోపాటు వెంకటయ్య ఆయన కొడుకు రాజు(11) హాజరయ్యారు. ఆదివారం ఉదయం వీరంతా గ్రామ సమీపంలో ఉన్న ఓ చెరువులోకి స్నానం చేసేందుకు వెళ్లారు. కుటుంబీకులు చెరువు గట్టున బట్టలు ఉతుకుతున్నారు. చెరువుగట్టున ఓ చిన్న పడవ కనిపించడంతో బాలకృష్ణతో పాటు ముగ్గురు అందులో ఎక్కారు. సరదాగా చెరువులోకి వెళ్లారు. కొంతదూరం వెళ్లాక పడవ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. సుభాన్ మినహా మిగతా ముగ్గురికి ఈత రాకపోవడంతో వారంతా నీట మునిగారు. వారిని కాపాడే ప్రయత్నంలో సుభాన్ కూడా నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు. చెరువుగట్టున ఉన్న సుభాన్ భార్య జ్యోతి, వెంకటయ్య భార్య నిర్మల విషయం గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచఉదయం దాదాపు 10 గంటలకు ప్రమాదం జరిగింది. గ్రామంలో ఉన్న ఈతగాళ్లతో సాయంత్రం 5 వరకు చెరువులో గాలించి మృతదేహాలను వెలికితీశారు.
 అయ్యో పాపం..
 వేడుకకు వచ్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడడంతో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బాలకృష్ణ, సుభాన్, వెంకటయ్యల భార్యలు గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయ విదారకం. తోడళ్లులు అత్తాగారింట్లో దుర్మరణం చెందడంతో దేవరంపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులు బాలకృష్ణ, సుభాన్, వెంకటయ్య స్థానికంగా రోజువారి కూలీపనులు చేస్తుండేవారు. రాజు స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతుండేవాడు. వెంకటయ్యకు భార్య నిర్మల, కొడుకు శ్రీకాంత్ ఉన్నారు.  
 వద్దన్నా వినకుండా..
 సుభాన్‌కు మినహా మిగతా ముగ్గురికి ఈత రాకపోవడంతో చెరువులోకి వెళ్లొద్దని గట్టున ఉన్న కుటుంబీకులు వారిని వారించారు. అయినా వినకుండా పడవ ఎక్కిన వారు సరదాగా చెరువులోకి వె ళ్లి మృత్యువాత పడ్డారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన వికారాబాద్ డీఎస్పీ టి. స్వామి సందర్శించారు. కుటుంబీకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వేడుకకు వచ్చిన నలుగురు నీటమునిగి మృత్యువాత పడడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలకు మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ సీఐ రవి, మోమిన్‌పేట ఎస్‌ఐ రాజు తెలిపారు.

మరిన్ని వార్తలు