నాణ్యతకు పెద్ద పీట : మంత్రి కేటీఆర్

18 Sep, 2014 00:52 IST|Sakshi
నాణ్యతకు పెద్ద పీట : మంత్రి కేటీఆర్

సనత్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ‘28వ చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ -2014’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పౌర సరఫరాలు, గృహ నిర్మాణ రంగాల్లో నాణ్యత ఉండేలా దృషి టసారించామన్నారు.

రాష్ట్రంలో 84 లక్షల ఇళ్లు ఉండగా, ఒక కోటి ఏడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఈ క్రమంలో అర్హులైన వారికి నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియను చేపట్టామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్లను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ‘మై విలేజ్-మైప్లాన్, మై టౌన్-మై ప్లాన్’ పేరిట కింది స్థాయి నుంచి నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.

ప్రతి జిల్లా కేంద్రంలో నిమ్స్‌లాంటి ఆస్పత్రులు, ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఉత్పత్తులను అందిస్తున్న వివిధ సంస్థలకు క్యూసీఎఫ్‌ఐ అవార్డులను ప్రదానం చేసింది. వీటిని మంత్రి చేతుల మీదుగా ఆయా సంస్థల ప్రతినిధులు అందుకున్నారు. కార్యక్రమంలో క్యూసీఎఫ్‌ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సీహెచ్.బాలకృష్ణారావు, ఎమిరటస్ చైర్మన్ ఎ.శ్యాంమోహన్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డీకే శ్రీవాత్సవ, క్యూసీఎఫ్‌ఐ వైస్ చెర్మన్ మనోహర్ హెడ్జ్, సెక్రటరీ విశాల్‌కరణ్, సీనియర్ సలహాదారుడు బి.సుబ్రమణ్యం పాల్గొన్నారు.
 
అవార్డులు అందుకున్న సంస్థలు..


బీహెచ్‌ఈఎల్, ఎన్‌ఎండీసీ, అమర్ రాజా బ్యాటరీస్, సోలార్ సెమీ కండక్టర్స్, రామ్‌కో సిమెంట్, ఉషా ఇంటర్నేషనల్, ఏపీఎస్‌ఆర్‌టీసీ, ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్.
 

మరిన్ని వార్తలు