వీరికి తెలిసింది ‘రెఫర్’ ఒక్కటే

9 Nov, 2014 00:36 IST|Sakshi

పరిగి: రోగం.. నొప్పి.. ఇంకేదైనాసరే.. పరిగి ప్రభుత్వ వైద్యులను ఆశ్రయించే వారు చెప్పేది ఒక్కటే ‘రెఫర్’. ప్రతి కేసును రెఫర్ చేయడం డాక్టర్లకు పరిపాటు అయిందని స్థానికులు మండిపడుతున్నారు. కాన్పు కోసం ఓ మహిళ ఆస్పత్రికి వస్తే పరీక్షించకుండానే వైద్యులు ఉస్మానియాకు రెఫర్ చేశారు. గంటలోపే స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మహిళకు నార్మల్ డెలివరీ జరిగింది.

 వివరాలు.. పరిగి గౌరమ్మ కాలనీకి చెందిన లలిత తన కూతురు మంజుల(28)ను కాన్పు కోసం  శనివారం తెల్లవారుజామున పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చింది. డ్యూటీ డాక్టర్, నర్సులు పరీక్షించి బీపీ ఎక్కువగా ఉంది..  కాన్పు చేయటం వీలుకాదని ఉస్మానియాకు రెఫర్ చేశారు. డబ్బులు లేక సర్కారు ఆస్పత్రికి వచ్చాం.. అంతదూరం ఎలా వెళ్తామని మంజుల కుటుంబీకులు వైద్యులను నిలదీశారు. చేసేది లేక పక్కనే ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

 గంటలోపే అక్కడ నార్మల్ డెలివరీ జరిగింది. తల్లిపిల్ల క్షేమంగా ఉన్నారు. బిల్లు మాత్రం రూ.10 వేలు అయింది. అంత డబ్బు తామెక్కడి నుంచి తీసుకురావాలి.. సర్కార్ వైద్యులే ప్రసవం చేస్తే సరిపోయేదని బాలింత కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. మంజుల పరిస్థితి విషమిస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ ఎలా జరుగుతుందని మండిపడ్డారు. రూ. 10 వేలు మీరే చెల్లించాలని పట్టుబట్టారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించారు. దీంతో చేసేది లేక మంజుల కుటుంబీకులు వెళ్లిపోయారు. ఈ విషయమై డ్యూటీ డాక్టర్ కిశోర్‌ను వివరణ కోరగా.. మంజులకు బీపీ ఎక్కువగా ఉండడంతో ఉస్మానియాకు రెఫర్ చేద్దామనుకున్నాం.. అంతలోపే వారు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. 

మరిన్ని వార్తలు