ఎలుకల మందు తాగించి.. గొంతు నులిమి..

9 Dec, 2014 03:54 IST|Sakshi
ఎలుకల మందు తాగించి.. గొంతు నులిమి..

ముగ్గురు పిల్లలను     హత్య చేసిన తండ్రి
     వలిగొండ మండలం     వెల్వర్తి గ్రామంలో దారుణం
     పోలీసులకు లొంగిపోయిన నిందితుడు..?
 
 వలిగొండ : కాపురానికి అడ్డొస్తున్నారని అనుకున్నా డో?..సాకలేక వదిలించుకోవాలనుకున్నాడో?.. కారణమైతే తెలియదు కానీ ఓ తండ్రి కర్కోటకుడిగా మారాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కడుపునపుట్టిన పిల్లలను తానే కాటేశాడు. శీతలపానియంలో ఎలుకలమందు కలిపి తాగించాడు.. అయినా చనిపోలేదని నిర్ధారించుకుని ఆపై గొంతు నులిమి కడతేర్చాడు. ఈ దారుణ ఘటన వలిగొండ మండలం వెల్వర్తి లో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
 గ్రామానికి చెందిన చముడాల రమేష్ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం గుర్రంపోడ్ మండలంమొసంగి గ్రామానికి చెందిన కవితను వివాహం చేసుకున్నాడు. మకాం హైదరబాద్‌కు మార్చి అక్కడే జీవనం సాగించాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు నిరోష (8), రక్షిత (7), కుమారుడు జశ్వంత్(4) జన్మించారు. భార్యభర్త సఖ్యత లేకపోవడంతో కవిత మూడేళ్ల క్రితం భర్తను, పిల్లలను విడిచిపెట్టి ఎటో వెళ్లిపోయింది. దీంతో రమేష్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని రామాంతపూర్‌కు చెందిన సుమలత ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు కలుగలేదు.  కొంత కాలం క్రితం రమేష్ తన పిల్లలు, భార్యతో కలిసి వెల్వర్తికి వచ్చి తన సోదరుడిఇంట్లో నివసిస్తున్నాడు. పెద్ద కూతురు స్థానిక పవిత్రాత్మ హాస్టల్‌లో ఉంటూ నాలుగో తరగతి చదువుతుండగా రక్షిత ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి, కుమారుడు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు.
 
 కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి..
 రెండో భార్య పుట్టింటికి వెళ్లడంతో రమేష్, అతడి ముగ్గురు పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆదివారం రాత్రి కూల్‌డ్రింక్‌లో ఎలుకలమందు కలిపి తన ముగ్గురు పిల్లలు నిరోష, రక్షిత, జశ్వంత్‌కు తాగించాడు. అనంతరం వారిని పడుకోబెట్టాడు. తెల్లవారుజామున వారి కదలికలను గుర్తించాడు.చనిపోలేదని నిర్ధారించుకుని  చేతి రుమాలుతో దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తానుకూడా ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించి విరమించుకున్నాడు. ఆపై విద్యుత్ దాఘాతంతో చనిపోవాలని ప్లగ్గులో వెర్లు పెట్టి వాటిని పట్టుకున్నాడు. వెంటనే విద్యుత్ ప్రసరణ కావడంతో బయపడి వెనుకంజ వేశాడు. ఈ సమయంలో అతని తండ్రి రాములు తలుపుకొట్టిన తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. దీంతో భయాందోళన చెందిన రమేష్  తలుపు తీసుకుని వెంటనే బైక్‌పై పారిపోయాడు.
 
 ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐలు
 ముగ్గురు చిన్నారులు మృతిచెందారన్న సమాచారం మేరకు రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, భువనగిరి రూరల్ సీఐ తిరుపతి, ఎస్‌ఐలు మంజునాథ్‌రెడ్డి, ప్రణీత్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలకు రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వెల్వర్తికి తరలించారు. ముగ్గురు చిన్నారుల మృతదేహాలను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు.  మృతుల తాత రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, రమేష్ పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం.
 
 రెండో భార్యను చితక్కొట్టడంతో..
 లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న రమేష్ తాగుడు కు బానిసయ్యాడు. రెండు,మూడు రోజుల కోసారి ఇంటికి వచ్చి భార్యతో తగాదా పడుతుండేవాడు. గత శనివారం కూడా భార్యతో గొడవపడి చితక్కొట్టాడు. దెబ్బలకు తాళలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకుని వచ్చి చిన్నారుల మృతదేహాలను చూసి సొమ్మసిల్లింది.
 
 బంధువులు వచ్చారని..
  బంధువులు వచ్చారని రమేష్ గ్రామంలోని హాస్టల్ ఉంటూ చదువుకుం టున్న నిరోషను ఆదివారం రాత్రి ఇంటికి తీసుకువచ్చాడు. కాగా, రెండో భార్య సుమలతతో గొడవపడిన రమేష్ ఆ కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు