నేడు ‘ఫీజు’పై త్రిసభ్య కమిటీ భేటీ

4 Feb, 2015 04:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉద్దేశించిన ముగ్గురు మంత్రుల కమిటీ భేటీ బుధవారం సచివాలయంలో జరగనుంది. ఉప ముఖ్యమంత్రి (విద్యాశాఖ మంత్రి) కడియం శ్రీహరి అధ్యక్షతన, విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి సభ్యులుగా ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఫాస్ట్ పథకాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఏయే అంశాల ప్రాతిపదికన విద్యార్థులకు ఫీజులు, బకాయిల చెల్లింపు చేయాలి, ఇందుకు ఏయే మార్గదర్శకాలను పెట్టాలి అనే అంశంపై త్రిసభ్య కమిటీ సచివాలయంలో విద్యాశాఖ, వివిధ సంక్షేమశాఖల అధికారులతో సమావేశం కానుంది. విద్యార్థుల కనీస విద్యార్హతలు, స్థానికత నిర్ధారణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపునకు కొత్తగా ఏవైనా మార్గదర్శకాలు చేర్చాలా అన్న దానిపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ అంశంపై విద్యా, సంక్షేమశాఖ అధికారులతో చర్చల సందర్భంగా వచ్చే సూచనలు, సలహాల ప్రాతిపదికన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు సమర్పించనుంది. నెల రోజుల్లో వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం మార్గదర్శకాలను ప్రకటించనున్నట్లు సమాచారం.
 సంక్షేమ మంత్రే లేకపోతే ఎలా...!
 ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రుల్లో ఎవరూ సభ్యులుగా లేకపోవడం చర్చనీయాంశమైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పూర్తిగా సంక్షేమ శాఖకు సంబంధించినది కాగా ఈ శాఖ మంత్రులకే ప్రాతినిధ్యం లేకపోవడం సరికాదంటున్నారు. పథకంతో ఏమాత్రం సంబంధం లేని విద్యాశాఖ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో విద్యుత్, వైద్యశాఖల మంత్రులను సభ్యులుగా వేస్తే దాని వల్ల ఒరిగేదేమీ ఉండదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించి, సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థుల గురించి వీరికి ఏ మేరకు అవగాహన ఉంటుంది, ఆయా సమస్యలు,అంశాలపై తగిన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోగలుగుతారనే ప్రశ్నలు వస్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు