మూడు మహిళా పారిశ్రామిక పార్కులు

9 Mar, 2017 01:10 IST|Sakshi

సుల్తాన్‌పూర్, తూప్రాన్, నందిగామలో ఏర్పాటు: కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల ను ప్రోత్సహించేందుకు సుల్తాన్‌పూర్‌ (సంగారెడ్డి జిల్లా), తూప్రాన్, నందిగామ (మెదక్‌)లో మహిళా పారిశ్రామిక పార్కులు నెలకొల్పనున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఇండిపెండెంట్‌ లోకల్‌ అథారిటీ (ఐలా) లుగా గుర్తించి ఈ పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే 100 ఎకరాల్లో మరో పారిశ్రామిక పార్కు నిర్మించి ఇస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద ర్భంగా బుధవారం పరిశ్రమల భవన్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో కేటీఆర్‌ మాట్లాడారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు శిక్షణ కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయిస్తామ న్నారు. మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించేందుకు ఇండస్ట్రియల్‌ క్లినిక్‌ ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే 90 రోజుల్లో మం జూరు చేసే ప్రోత్సాహకాలు, సబ్సిడీలను పెంచే అంశాన్ని ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 50ఎకరాల్లో నిర్మించను న్న మహిళా పారిశ్రామిక పార్కుకు సంబంధించిన భూ కేటాయింపుల పత్రాలను ఫిక్కీ లేడిస్‌ ఆర్గనైజేషన్‌ ప్రతిని ధులకు మంత్రి అందించారు. టీఎస్‌–ఐపాస్‌ విధానం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,500 కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, 50 శాతం పరిశ్రమల్లో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయని కేటీఆర్‌ వెల్లడించారు. ఈ పరిశ్రమల ద్వారా రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, 1.75 లక్షల మందికి ఉపాధి లభించనుందని వెల్లడించారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, సంస్థ ఎండీ ఈవీ నర్సింహా రెడ్డి, ఫిక్కీ, ఎలీప్, కోవె సంస్థల ప్రతినిధులు పద్మ, పద్మజారెడ్డి, రమాదేవి, శైలజారెడ్డి, గిరిజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు