ఇంకా తెలవారదేమి!

9 Jun, 2014 03:29 IST|Sakshi
ఇంకా తెలవారదేమి!

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా గెలిచినవారు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో గెలిచినా అధికార పగ్గాలు చేతికందలేదు. మండల, జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పీఠాల పై కన్నేసినవారు ‘ఎన్నికలు’ ఎప్పుడు నిర్వహిస్తారా అని ఎదురు చూస్తున్నారు.సార్వత్రిక ఎన్నికలకు ముందే బల్దియా, పరిషత్ ఎన్నికలు జరిగాయి.
 
 వీటి ఫలితాలను ప్రకటిస్తే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం పడుతుందేమోనని భావించినవారు కోర్టుకు వెళ్లా రు. దీంతో కౌంటింగ్‌ను సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు నిలిపివేశారు. ఆ గడువూ ముగిసింది. ఫలితాలూ వెలువడ్డాయి. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో అపాయింటెడ్ డే, నూతన ప్రభుత్వ ఏర్పాటు కారణంగా స్థానిక సంస్థల పాలక వర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడలేదు. ఇప్పుడు ఆ ప్రక్రియా ముగిసిపోవడంతో ఇక పాలకవర్గాల ఎన్నికలపై స్పష్టత వస్తుందని అందరూ భావించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున.. ఆ సమావేశాలు ముగిసిన తర్వాతే మున్సిపల్, పరిషత్ అధ్యక్షుల ఎన్నిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.
 
వెయిటింగ్‌లో 760 మంది..
జిల్లాలో కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల పరిధిలో 91 మంది కౌన్సిలర్లుగా, నిజామాబాద్ కార్పొరేషన్‌లో 50 మంది కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. జిల్లాలో 583 మంది ఎంపీటీసీలుగా, 36 మంది జడ్పీటీసీలుగా గెలిచారు. వీరంతా బాధ్యతలు స్వీకరించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పగ్గాల కోసం కొందరు, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకోసం ఇంకొందరు తహతహలాడుతున్నారు.
 
కోఆప్షన్ మెంబర్లుగా 41 మందికి..
స్థానిక సంస్థల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాకుండా కోఆప్షన్ మెంబర్ పదవులు పలువురిని ఊరిస్తున్నాయి. ఒక్కో మండల పరిషత్‌నుంచి ఒక్కొక్కరికి, జిల్లా పరిషత్‌లో ఇద్దరికి, ఒక్కో బల్దియాలో ఒక్కొక్కరికి కోఆప్షన్ మెంబర్‌గా అవకాశం లభిస్తుంది. పాలకవర్గాల ఎన్నికల కోసం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తేనే వీరి నియామకంతోపాటు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు బాధ్యతలు స్వీకరించే అవకాశాలుంటాయి. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై వారం పాటు కొనసాగనున్నాయి. ఆ తర్వాతే మున్సిపల్, పరిషత్ చైర్మన్ల ఎన్నికలపై ఈసీ ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. అప్పటివరకు కొత్త నేతలకు ఎదురు చూపులు తప్పేలా లేవు.

మరిన్ని వార్తలు