పోస్టుకార్డుకు 141 ఏళ్లు

1 Jul, 2019 13:29 IST|Sakshi

పోస్టుకార్డు పుట్టి 141 ఏళ్లు  

ఘన చరిత్ర కలిగిన ఆ కార్డుకు ఆదరణ కరువు 

నేడు పోస్టుకార్డు దినోత్సవం  

ఇంటి ముందు నుంచి పోస్ట్‌ అని గట్టిగా పిలుపు వినపడగానే ఏదో ఉత్తరం వచ్చిందనుకునే పరుగెత్తే దృశ్యాలు పాతకాలంలో కనిపించేవి. ఆ చిన్ని ఉత్తరం రాగానే ఇంటిల్లిపాది ఒకచోట చేరి దానిని చదివి ఎంతో ఆనందించేవారు. అదే పోస్టుకార్డు. చిన్నగా ఉండే ఆ పోస్టు కార్డు ఎన్నో పెద్దపెద్ద విషయాలను మోసుకొచ్చేది. ఆ చిట్టి పోస్టుకార్డే కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచేది. మనుషుల మధ్య బలమైన సంబంధాలను ఏర్పర్చేది. అంతటి ఘన కీర్తి కలిగిన ఆ పోస్టుకార్డుకు ప్రస్తుతం ఆదరణ లేదు. ఇప్పుడున్న డిజిటల్‌ యుగంలో ఆ పోస్టుకార్డుకు స్థానం లేదు. తమ భావాలను పంచుకునేందుకు, విషయాలను వివరించేందుకు ఆ పోస్టుకార్డు ఉనికి లేదు. సర్వం మొబైల్‌ మయం. నేడు పోస్టుకార్డు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం  

సాక్షి, పాల్వంచరూరల్‌(ఖమ్మం) : నాడు ఎంతో ఆదరణ పొందిన పోస్టుకార్డుకు మారుతున్న ఆధునిక సమాజంలో ఆదరణ కరువైంది. సాంకేతిక విప్లవంతో అధునాతమైన మొబైళ్లు అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్‌ యుగం రాకెట్‌ స్పీడుతో దూసుకుపోతుండటంతో 14 దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన, మంచిచెడుల సమాచారాన్ని చేరవేసే తోకలేని పిట్ట పోస్టుకార్డు నిరాదరణకు గురై కనుమరుగు అయ్యే పరిస్థితి నెలకొంది. భారతదేశంలో నాడు పాలించిన అంగ్లేయుల పాలనలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ తయారు చేసినట్లు చెబుతున్న పోస్టుకార్డు 1879 జూలై 1న ఆవిర్భవించింది. నాడు ఈ కార్డును అణాపైసకు విక్రయించేవారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పోస్టుకార్డును వినియోగించుకునేవారు. సూదూర ప్రాంతాల్లోని బంధువుల యోగ క్షేమాల సమాచారం కార్డు ద్వారానే తెలుసుకునే అవకాశం ఉండేది. గతంలో ప్రభుత్వాలు కూడా పోస్టు కార్డు మీద ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముద్రించి ప్రచారం చేసేవి. కానీ, గతంతో పరీశీలించి చూస్తే ప్రస్తుతం కార్డు  ప్రభావం గణనీయంగా తగ్గింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల ప్రవేశంతో పోస్టుకార్డు నేడు ఉనికిని కోల్పోయే దశకు చేరింది. ప్రజలకు ఈ కార్డు ఆవసరం లేకుండా పోయింది. 

తొలి తెలంగాణ ఉద్యమంలో పోస్టుకార్డు కూడా కీలక భూమిక పోషించిందని నాటి స్వాతంత్య్ర సమరయోధులు అంటున్నారు. మలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను వివరించడానికి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రులకు పోస్టుకార్డు ద్వారా లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందు నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ప్రజలు పోస్టుకార్డు ద్వారా అభిప్రాయాలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల ప్రభావంతో పోస్టుకార్డుల వినియోగాన్ని ప్రజలు మరిచిపోయారు. దీంతో ప్రస్తుతం అర్ధ రూపాయి ధర కలిగిన పోస్టుకార్డును పోస్టు ఆఫీస్‌లోకి వెళ్లి కొనుగోలు చేసే దిక్కులేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కనుమరుగవుతున్న పోస్టుకార్డుకు భవిష్యత్‌లోలైనా పూర్వవైభవం రావాలని అశిద్దాం.  

అదరణలేక పోవడం బాధాకరం 
మారుతున్న కాలంలో పోస్టుకార్డులకు ఆదరణ లేకపోవడం బాధాకరంగా ఉంది. నాకు ఉద్యోగం రాకముందు గొళ్లపూడిలో 1983 నుంచి 87 వరకు పోస్టుమాస్టర్‌గా పనిచేశాను. సంక్రాంతి పండగ, రాఖీ, నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు భారీగా పోస్టుకార్డులు వచ్చేవి. వాటిని పంపిణీ చేయించడానికి రెండురోజులు పట్టేది. పోటీ పడి వాటిని తీసుకునేవారు. అంతటి ఆదరణ కలిగిన పోస్టుకార్డులు నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
 -రామశాస్త్రి, ఈఓఆర్డీ, పాల్వంచ   

నేటి ప్రజలు మరిచిపోయారు.. 
తక్కువ ఖర్చుతో పోస్టుకార్డు ద్వారా ఎక్కువ సమాచారం అందించవచ్చు. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్‌కు గానీ, కళాశాలల్లోగానీ పోస్టుకార్డు వస్తే నోటీస్‌ బోర్డులోకి వెళ్లి చూసుకునేది. కార్డుపై రాస్తే అందరికీ కనిపిస్తుందని భయమేసేది. అందరూ చదువుకునేవాళ్లు. అప్పట్లో ఎంతో అదరణ పొందిన పోస్టుకార్డును నేటి ప్రజలు మరిచిపోయారు.  
డాక్టర్‌ వై.చిన్నప్ప,  ప్రిన్సిపాల్, జీడీసీ పాల్వంచ  

పోస్టుమెన్‌ కోసం ఎదురుచూసే వాళ్లం.. 
సెల్‌ఫోన్లు, వాట్సాప్‌లు, ట్విట్టర్లు, ఈమెయిళ్లు లేని రోజుల్లో కేవలం పోస్టుకార్డులపై ఆధారపడ్డాం. పోస్టుమెన్‌ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ నిరీక్షించేవాళ్లం. పొరుగు ఊరు నుంచి బంధువులు పోస్టుకార్డుపై యోగ క్షేమాలు రాసి పంపేవారు. కార్డులు చదువుకుని తిరిగి మళ్లీకార్డుపై రాసి పంపించాం.       
 డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్‌ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల  

క్షేమ సమాచారం తెలుసుకునేవాళ్లం.. 
దూర ప్రాంతాల్లో బంధువులు, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను కేవలం పోస్టుకార్డుపై రాసి తెలుసుకునేవాళ్లం. నాటికి నేటికి ఎంతో తేడా ఉంది. 
వెంకటేశ్వర్లు, వ్యాపారి, కొత్తగూడెం  

మరిన్ని వార్తలు