నేడు ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక

7 Aug, 2014 02:23 IST|Sakshi

బుధవారం రాత్రి వరకు తెగని టీడీపీ అభ్యర్థిని వివాదం
తుమ్మల వర్గానికి చెందిన కవితకు జెడ్పీ చైర్‌పర్సన్ ఛాన్స్!


ఖమ్మం: ఖమ్మం జిల్లా పరిషత్ పీఠంపై ఎవరు కొలువు దీరుతారనేది నేడు తేలిపోనుంది. ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాన్ని గురువారం జరగనున్న ఎన్నికలలో తెలుగుదేశం గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆ పార్టీ తరఫున అభ్యర్థిని ఎవరన్న దానిపై బుధవారం రాత్రి వరకు ఏమీ తేలలేదని సమాచారం. బుధవారం సాయంత్రం చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చల్లో  తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు చెరో పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. వెంకటాపురం జెడ్పీటీసీ కవితను తుమ్మల ప్రతిపాదిస్తుండగా, ఏన్కూరు జెడ్పీటీసీ శ్యామలను నామా ప్రతిపాదించారని తెలిసింది. అయితే తుమ్మల వర్గానికి చెందిన కవితను జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. కాగా, అభ్యర్థి పేరును అధికారికంగా గురువారం ప్రకటించనున్నారు. జడ్పీలో మొత్తం 39 స్థానాలకు గాను టీడీపీకి 19 మంది సభ్యుల బలముంది. ఒక్క జెడ్పీటీసీ అదనంగా లభిస్తే ఆ పార్టీకి పీఠం దక్కుతుంది. ఇందుకు గాను సీపీఐ, సీపీఎంలతో  అవగాహన కుదిరిందని సమాచారం. కాంగ్రెస్‌కు 10 మంది, వైఎస్సార్‌సీపీకి నలుగురు సభ్యుల బలం ఉంది. ఇక, ముగ్గురు సభ్యులున్న సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఎన్నికను బహిష్కరించే యోచనలో ఉంది. టీడీపీ గ్రూపుల మధ్య సమన్వయం లోపిస్తే అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ప్రశాంతంగా ఎంపీపీ ఎన్నికలు

ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగి శాయి. ముంపు మండలాలను మినహాయిస్తే మొత్తం 39 మండలాలకు గాను మూడు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. 36 మండలాల్లో 25 చోట్ల మహిళలే మండలాధీశులుగా ఎన్నిక కావడం విశేషం. 36 స్థానాలలో టీడీపీ 17, కాంగ్రెస్ 6, సీపీఎం 5, వైఎస్సార్ సీపీ 2, సీపీఐ 2, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ 2, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాలలో గెలుపొందారు.
 
జెడ్పీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ.

హైదరాబాద్: ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ, ఇతర అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికలను నిలుపుచేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల, జిల్లాలో రిజర్వేషన్లలో మార్పులు చోటు చేసుకున్నాయని, తాజాగా రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని, అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని ఖమ్మం జిల్లాకు చెందిన సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ రామచంద్రరావు విచారించారు.
 

>
మరిన్ని వార్తలు