సార్ అడుగుజాడల్లోనే సర్కారు | Sakshi
Sakshi News home page

సార్ అడుగుజాడల్లోనే సర్కారు

Published Thu, Aug 7 2014 2:18 AM

సార్ అడుగుజాడల్లోనే సర్కారు

వరంగల్: ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంటుందని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య చెప్పారు. ఫ్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం హన్మకొండలోని ఏకశిల పార్కులో జయశంకర్ విగ్రహాన్ని రాజయ్య ఆవిష్కరించారు. అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన సభలో రాజయ్య మాట్లాడుతూ.. సార్ ఆశించిన నవ తెలంగాణ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ విలక్షణ, విశిష్టవ్యక్తి అని, దార్శనికుడని కొనియాడారు. ఏకశిల పార్కును జయశంకర్ స్మృతి వనంగా తీర్చిదిద్దాలని ఎంపీ కడియం శ్రీహరి కోరారు.

ఉద్యమ స్ఫూర్తి ప్రదాత: కోదండరాం
వికారాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ అని, రాష్ట్ర సాధనలో ఆయన ముఖ్య భూమిక పోషించారని జేఏసీ చైర్మన్ కోదండరాం కొనియాడారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో  బుధవారం జయశంకర్ 82వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కోదండరాం మాట్లాడారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు.

ఢిల్లీలో టీఆర్‌ఎస్ ఎంపీల ఘన నివాళి
న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పోరాటాలు స్ఫూర్తిదాయకమని టీఆర్‌ఎస్ ఎంపీ లు పిలుపునిచ్చారు.జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారమిక్కడి తెలంగాణ భవన్‌లో ఎంపీలు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, బీబీపాటిల్, విశ్వేశ్వర్‌రెడ్డి, వినోద్‌తోపాటు మాజీ మంత్రి శంకర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement