ఆందోళన వద్దు..అండగా ఉంటాం

14 Jun, 2015 04:20 IST|Sakshi

కడ్తాల : పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా.. అండగా ఉంటామని, ఆందోళన వద్దని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు భరోసాఇచ్చారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఆమనగల్లు మండలం కడ్తాలలోని ఎంబీఏ గార్డెన్స్‌లో స్థానిక ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అధ్యక్షతన కల్వకుర్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ.. మాయమాటలు, అబద్ధాలు, భ్రమలు చూపి టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంటికో ఉద్యోగం పేరు అధికారంలోకి వచ్చి లక్ష ఉద్యోగా లు భర్తీచేస్తానని నిరుద్యోగుల జీవితాల తో ఆడుకుంటున్నారని విమర్శించారు.

 కేఎల్‌ఐ సాగునీరు అందించాలి
 వచ్చే ఖరీఫ్ నాటికి కల్వకుర్తి నియోజకవర్గానికి 62,140 ఎకరాలకు కేఎల్‌ఐ సాగునీరు అందించకపోతే రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తానని స్థానిక ఎమ్మె ల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2999కోట్లు కేటాయిం చిందని గుర్తుచేశారు. ఇన్ని నిధులు ఖర్చుచేసినా సాగునీరు అందడం లేదన్నారు. సీఎం కేసీఆర్ పాత ప్రాజెక్టులను పక్కన పెట్టడం తదన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి 90వేల ఎకరాలకు సాగునీరు అందించేలా పథకాన్ని రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. కేఎల్‌ఐ, పాలమూరు ఎత్తిపోతల పథకాల ద్వారా 1.57లక్షల ఎకరాలకు సాగనీరు అందేవరకు పోరాటం సాగిస్తామని స్పష్టంచేశారు. పీసీసీ అధికార ప్రతినిధి మల్లురవి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీ కుటుంబపాలను గమనిస్తున్నారని ఎద్దేవాచేశారు. ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు.

హామీలను అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు ప్రజలు సోనియాగాంధీకి రుణపడి ఉన్నారని చెప్పారు. అనంతరం తలకొండపల్లి మండలం సాలార్‌పూర్‌కు చెందిన పార్టీ కార్యకర్త ఎక్బాల్ ఆవులు చనిపోవడంతో అతడిని ఆదుకునేందుకు పార్టీ తరఫున రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

>
మరిన్ని వార్తలు