అడవి బిడ్డలకు పురిటి కష్టాలు

9 Nov, 2018 11:09 IST|Sakshi

రోడ్డుపైనే ప్రసవించిన గిరిజన మహిళ

సాక్షి,మంగపేట: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి పంచాయతీ పరిధి కమలాపురం అటవీ ప్రాంతంలో ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. కనీస రవాణా సదుపాయం కూడా లేకపోవడంతో గొత్తికోయ మహిళలు పురుటి నొప్పులతో అల్లాడిపోతున్నారు. తాజాగా కోమటిపల్లి పంచాయతీ పరిధి రేగులగూడెం గొత్తికోయ గిరిజన గ్రామానికి చెందిన మహిళ రోడ్డుపై ప్రసవించిన సంఘట దీపావళి పండుగ రోజు చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేగులగూడేనికి చెందిన మడకం మల్లమ్మకు తొలికాన్పు. బుధవారం పురిటినొప్పులు రావడంతో మధ్యాహ్నం మూడు సమయంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

గంట సమయం గడిచిన తరువాత మల్లమ్మకు మళ్లీ నొప్పులు రావడంతో ఆందోళన చెందిన గూడెం వాసులు పుట్టిన బిడ్డలోపాటు ఆమెను ఎడ్లబండిలో కమలాపురం తీసుకువచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు బండి నుంచి మల్లమ్మను దింపుతున్న క్రమంలో మరో బిడ్డకు రోడ్డుపైనే జన్మనిచ్చింది. వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో స్థానికుల సహకారంతో  ప్రైవేట్‌ వాహనంలో ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలు, తల్లి క్షేమంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు