అందుకే సీఎం, సెలవులు పెంచారు: హరీష్‌ రావు

30 May, 2019 19:30 IST|Sakshi

సిద్ధిపేట జిల్లా: ఎండలు బాగా ఉన్నాయనే కారణంగా విద్యార్థులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సెలవులను పొడిగించారని సిద్ధిపేట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు తెలిపారు. సిద్ధిపేట పట్టణం ఆర్డీఓ ఆఫీసులో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులు.. మొత్తం 315 మందికి, 3 కోట్ల 2 లక్షల రూపాయల చెక్కులను హరీష్‌ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ..వడదెబ్బకు సిద్ధిపేట మండలం నాంచారుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మరణించడం చాలా బాధాకరమన్నారు. వర్షాలు పడాలంటే చెట్లను పెంచాలని సూచించారు. మన ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పెంచినట్లు రెండు చెట్లను పెంచాలని సూచించారు.

తాము మీ సేవకుడిగా పని చేస్తామని, మీరు చెట్లు పెంచి సేవ చేయాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా చెక్కులు తీసుకున్నా ప్రతి అక్క చెల్లె రెండు చెట్లను పెంచాలని కోరారు. గ్రీన్‌ అండ్‌ క్లీన్‌ సిద్ధిపేటగా మారాలంటే చెట్లు పెంచాలన్నారు. మన పిల్లల్ని కాపాడుకున్నట్లు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రి కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం బాగుందని చెప్పారు. సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. మనకు రోగాలు రావద్దంటే చెట్లు విరివిగా పెంచాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు