‘డబుల్‌’ పథకం ఓ వరం

9 Jun, 2018 20:54 IST|Sakshi
గృహ ప్రవేశం చేస్తున్న  ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌

రఘునాథపాలెం : డబుల్‌ బెడ్‌రూం పథకం పేద ప్రజలందరికీ ఓ వరంగా ఉందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం రఘునాథపాలెం మండలంలోని శివాయిగూడెంలో తొలి విడతగా పూర్తయిన 218 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను 166 మంది లబ్ధిదారులకు కేటాయించగా, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పాపాలాల్‌తో కలిసి ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌  ప్రాంభోత్సవం చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు.

2016లో జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నగరంలో అత్యధికంగా పేదలు ఉన్నారని, వారందరికి 2 వేల ఇళ్లను మంజూరు చేశారన్నారు. తొలి విడతగా ఖమ్మం నియోజకవర్గానికి కేటయించిన ఇళ్లు పలు నిర్మాణాల్లో ఉన్నాయన్నారు. శివాయిగూడెంలో చేపట్టిన ఇళ్లు పూర్తి చేసుకోవటంతో రెవెన్యూ అధికారులు ఎంపికను పారదర్శకంగా చేపట్టారన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీలతను, ఆర్‌వీఎం అధికారి రవికుమార్‌లను ఎమ్మెల్యే అభినందించారు. వచ్చే ఏడాది కల్లా నియోజకవర్గానికి కేటాయించిన 2 వేల ఇళ్లను పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. శివాయిగూడెంలో పూర్తయిన 216 ఇళ్లను నగర పరిధిలో 2, 3, 4, 56 డివిజన్లకు కేటాయించటం జరిగిందన్నారు.

 
కార్యక్రమంలో ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీలత, కార్పొరేటర్లు చావా నారాయణ, కొనకంచి సరళాప్రసాద్, మందడపు మనోహర్, ఎస్‌.వెంకన్న, నాగండ్ల కోటి, ఆత్కూరి హనుమాన్, కమర్తపు మురళీ, పగడాల నాగరాజు, రైతు సమితి జిల్లా సభ్యులు మందడపు సుధాకర్, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్‌ మందడపు నర్సింహారావు, ఆత్మ చైర్మన్‌ మెంటెం రామారావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ, టీఆర్‌ఎస్‌ నాయకులు దండా జ్యోతిరెడ్డి, నర్రా యల్లయ్య, హెచ్చు ప్రసాద్, షేక్‌ మహ్మద్, శివాయిగూడెం గ్రామ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు సిద్దయ్య, రవి, చెరుకూరి ప్రదీప్, శివాయిగూడెం సర్పంచ్‌ బాణోతు నాగమణి, నాగేశ్వరరావు, మాదగాని సుదర్శన్‌రావు, సుంకర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు