భవనాల కూల్చివేతకే మొగ్గు..!

24 Jun, 2019 02:07 IST|Sakshi
కొత్త సచివాలయం కోసం భూమి పూజ చేయనున్న ప్రాంతమిదే

సచివాలయంతోపాటు చుట్టూ ఉన్న భవనాలు కూడా...

నేలను సమాంతరంగా చదును చేశాకే కొత్త భవన నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం

చతురస్రాకారంలో కొత్త సచివాలయ నిర్మిత ప్రాంతం అభివృద్ధి

ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించనున్న మంత్రివర్గ ఉపసంఘం  

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయ ప్రాంగణం లోని భవనాల కూల్చివేతకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. సచివాలయంలోని కట్టడాలన్నింటినీ కూల్చేసి నేలను సమాంతరంగా చదును చేశాకే కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుత సచివాలయం మొత్తం 25.5 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీని చుట్టూ ఉన్న ఇతర భవనాలను సైతం స్వాధీనం చేసుకొని కూల్చేయాలని భావిస్తోంది. సచివాలయం వెలుపల ఉన్న ఈ భవనాల స్థలాలను కలిపేసుకోవడం ద్వారా వాస్తుదోషాల్లేకుండా కొత్త సచివాలయ నిర్మిత స్థలాన్ని చతురస్రాకార రూపంలో అభివృద్ధిపరచాలని యోచిస్తోంది. 

ప్రస్తుత సచివాలయం 10 బ్లాకులుగా విస్తరించి ఉండగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు ఒకే సమీకృత భవనంగా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. హుస్సేన్‌ సాగర్‌కు అభిముఖంగా (లేక్‌వ్యూ) దాదాపు 4 లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త భవన సముదాయం ఎదురుగా ఖాళీగా ఉండే సువిశాల స్థలంలో వనాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్లను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దనుంది. కొత్త సచివాలయ నిర్మాణంపై రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాలపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ భవనాల కూల్చివేతపై తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. 

కూల్చివేతలకు మార్గం సుగమం... 
ప్రస్తుత సచివాలయంలో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన సర్వహిత బ్లాక్‌ (జీ–బ్లాక్‌) శిథిలావస్థకు చేరడంతో గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంచారు. సైఫాబాద్‌ ప్యాలెస్‌గా ఖ్యాతి గడించిన ఈ భవనాన్ని 1888లో ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ నిర్మించారు. ఈ భవనానికి ఉన్న వారసత్వ సంపద హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చట్ట సవరణ జరపడంతో దీని కూల్చివేతకు మార్గం సుగమమైంది. ఇక సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాకులు 35,818 చదరపు మీటర్ల స్థలంలో విస్తరించి ఉండగా జే, కే, ఎల్, హెచ్‌ నార్త్, సౌత్‌ బ్లాక్‌లు 49,342 చదరపు మీటర్లలో విస్తరించి ఉన్నాయి. వీవీఐపీలకు రక్షణ, ఇతర భద్రతా ప్రమాణాల రీత్యా ఈ భవనాలు సురక్షితం కాదని రాష్ట్ర పోలీసు, అగ్నిమాపక శాఖలు ఇప్పటికే అధ్యయనం జరిపి నివేదికలు సమర్పించినట్లు తెలిసింది. దీంతో ఈ బ్లాకులను సైతం కూల్చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం.  

కొత్త సచివాలయానికి నలువైపులా రోడ్లు... 
కొత్త సచివాలయాన్ని 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సచివాలయం చుట్టూ ఉన్న కొన్ని భవనాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. సీ–బ్లాక్‌ వెనుక భాగంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మింట్‌ కాంపౌండ్, గవర్నమెంట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ మినహా మిగిలిన భవనాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటితోపాటు ఎన్టీఆర్‌ గార్డెన్స్‌కు ఆనుకొని ఉన్న దారిలోని తెలంగాణ గేట్‌ పక్కనున్న విద్యుత్‌ సంస్థల భవనాలు, ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, ఇతర భవనాలను కొత్త సచివాలయ ప్రాంగణంలో కలిపేసుకోనున్నారు. కొత్త సచివాలయ నిర్మిత ప్రాంతానికి చతురస్రాకార రూపు కల్పించడం ద్వారా వాస్తుదోషాలను నివారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త సచివాలయం చుట్టూ నలువైపులా రోడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 

ఏకకాలంలో రెండింటి నిర్మాణాలు... 
కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలను ఏకకాలంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను కూల్చేసి కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించనుంది. మూడేళ్ల కింద అదే ప్రాంతంలో నిర్మించిన రోడ్లు, భవనాలశాఖ భవనాన్ని కొత్తగా నిర్మించనున్న శాసనసభ కార్యాలయంగా వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధ భవనాన్ని కూల్చాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తోంది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాలపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం ఏయే భవనాలను స్వాధీనం చేసుకోవాలి? ఏయే భవనాలను కూల్చేయాలి? ఏయే భవనాలను మనుగడలో ఉంచాలన్న అంశాలపై అధ్యయనం జరపడానికి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 

ప్రభుత్వశాఖల తరలింపుపై కసరత్తు ముమ్మరం... 
ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఇక్కడున్న వివిధ శాఖల కార్యాలయాలను వేరే ప్రాంతాల్లోని భవనాలకు తరలించడంపై కసరత్తు ముమ్మరం చేసింది. సచివాలయంలో వివిధ శాఖలు వినియోగిస్తున్న స్థలం, ఆయా శాఖల తరలింపునకు సంబంధించిన కార్యాచరణ, సచివాలయం వెలుపలి ప్రాంతాల్లో ఉన్న ఆయా శాఖల హెచ్‌ఓడీ కార్యాలయాల భవనాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల సమాచారాన్ని సాధారణ పరిపాలనశాఖ సేకరించింది. సచివాలయానికి దగ్గరలో ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలన కార్యాలయం, ఆర్థికశాఖ కార్యాలయాన్ని తరలించాలని నిర్ణయానికి వచ్చింది. మిగిలిన శాఖలను ఆయా శాఖల హెచ్‌ఓడీ కార్యాలయాలకు తరలించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.  

మరిన్ని వార్తలు