15 వేల పోలీసు కొలువులు

26 Jun, 2019 01:40 IST|Sakshi

కసరత్తు చేస్తున్న రిక్రూట్‌మెంట్‌ బోర్డు

14 వేల కానిస్టేబుల్‌ పోస్టులు, వెయ్యి ఎస్సై పోస్టుల భర్తీ!

ఈసారి 33 జిల్లాల ప్రాతిపదికన నియామకాలు

ప్రస్తుత రిక్రూట్‌మెంట్‌ పూర్తికాగానే కొత్త నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌ : నిరుద్యోగులకు మరో శుభవార్త. త్వరలోనే పోలీసుశాఖలో మరో 15,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) కసరత్తు చేస్తోంది. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి తెలిపారు. ప్రస్తుతం గతేడాది జారీ చేసిన పోలీసు నియామకాల ప్రక్రియను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వేగవంతం చేసింది. శారీరక, తుది రాత పరీక్షలు విజయవంతంగా ముగించిన అభ్యర్థులకు ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా పూర్తయింది. త్వరలోనే కటాఫ్‌ మార్కులు ప్రకటించి అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియ చేపట్టే పనిలో తలమునకలైంది. ఈ ప్రక్రియ పూర్తయితే డిపార్ట్‌మెంట్‌లోకి కొత్తగా 18,500 మంది అధికారులు విధుల్లో చేరుతారు. వారిలో 17,156 కానిస్టేబుల్, 1,275 ఎస్సైలు ఉంటారు. 

కొత్త జిల్లాల ప్రాతిపదికనే.. 
గతేడాది మేలో విడుదలైన టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నోటిఫికేషన్‌ ప్రకారం పాత జిల్లాల ప్రాతిపదికగా ఖాళీల భర్తీ చేపడుతున్నారు. కానీ త్వరలో చేపట్టబోయే రిక్రూట్‌మెంట్‌లో మాత్రం 33 కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టుల నియామకం చేపట్టే ఆలోచనలో ఉన్నారు. ఆలోగా కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 18,500 పోస్టులను భర్తీ చేశాక మరోసారి సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్‌ తదితర విభాగాల్లో కొత్త జిల్లాలవారీగా ఖాళీలను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే దాదాపు 15,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. వాటిలో దాదాపు 14,000 కానిస్టేబుళ్లు, సుమారు 1,000 ఎస్సై పోస్టులు భర్తీ చేయనున్నారని సమాచారం. 

వీక్లీ ఆఫ్‌ అమలుకు ఇక మార్గం సుగమం.. 
ప్రస్తుతం పోలీసుశాఖలో 32 వేల మంది సివిల్, 14 వేల మంది ఏఆర్, 8 వేల మంది వరకు టీఎస్‌ఎస్‌పీ కలిపి దాదాపు 54,000 మంది పోలీసులు ఉన్నారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్న పోలీసుశాఖ అనేక దశాబ్దాల తరువాత వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తోంది. త్వరలో డిపార్ట్‌మెంట్‌లో చేరబోయే 18,500 మంది చేరికతో పనిభారం కాస్త తగ్గనుంది. వారికి అదనంగా మరో 15 వేల మంది చేరితే డిపార్ట్‌మెంట్‌కు మరింత ఉపశమనం లభించనుంది.  

మరిన్ని వార్తలు