రెండోరోజు సమ్మె విజయవంతమైంది

6 Oct, 2019 20:25 IST|Sakshi

ఆర్టీసీ జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రెండో రోజూ ఆర్టీసీ సమ్మె విజయవంతమైందని ఆర్టీసీ జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి అన్నారు. ‘ఆర్టీసీ కార్మికుల సమ్మె​‍-రేపటి కార్యాచరణ’పై ఆర్టీసీ జేఏసీ మీడియా సమావేశం నిర్వహించింది. సోమవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో చేపట్టనున్న నిరాహార దీక్షలో 16 మంది జేఏసీ సభ్యులు పాల్గొంటారని ఆశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదని, వేతనాలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఏ ఉద్యోగ సంఘాలను విమర్శించేదిలేదన్న ఆశ్వత్థామ రెడ్డి..సమ్మెకు మద్దతు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆర్టీసీని కాపాడేవిధంగా ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు వాస్తవ పరిస్థితులను వివరించాలని కోరారు. వివిధ రాజకీయ పక్షాలను కలిసి మద్దతు కోరామని ఆయన వెల్లడించారు.

ఆర్టీసీకి ప్రత్యామ్నాయం లేదు : రాజిరెడ్డి
ప్రజా రవాణాను కాపాడుకోవడానికే సమ్మె చేస్తున్నామని జేఏసీ నేత రాజిరెడ్డి తెలిపారు. ఆర్టీసీకి ప్రత్యామ్నాయం ఏదీ లేదని.. ఇది పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతుందని విమర్శించారు. అద్దె బస్సులను కొత్తగా వేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు