నష్టాలు..ఆపై సమ్మె కష్టాలు..

3 Dec, 2019 07:07 IST|Sakshi

రూ.1,200కోట్లకు చేరిన ఆర్టీసీ ఆర్థిక భారం..

సాక్షి, హైదరాబాద్‌ : గత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ దాదాపు రూ.928 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈసారి అది రూ. వేయి కోట్లకు మించుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. తాజాగా 52 రోజుల పాటు జరిగిన సమ్మె వల్ల పరిస్థితి అంతా అస్తవ్యస్తమై ఆ నష్టం రూ.1,200 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అధికారులు ఇదే విషయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్‌కు కూడా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నష్టాలు ఈస్థాయిలో నమోదు కాలేదు. అప్పట్లో గరిష్టంగా రూ.718 కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పుడు ఒక్క టీఆఎస్‌ఆర్టీసీ నష్టాలే రూ.1200 కోట్లకు చేరుకునే స్థితి ఉత్పన్నం కావటం ఆందోళన పరుస్తున్న విషయం. పెరిగిన టికెట్ల ధరలతో రూ.850 కోట్ల మేర ఆదాయం పెరగనుంది. సమ్మె వల్ల అదనపు నష్టం నమోదై ఉండకపోతే ఆర్టీసీ స్థితి మెరుగ్గా ఉండేది. ఇప్పుడు ఆశించిన అదనపు ఆదాయం వచ్చినా నష్టాలదే పైచేయి కానుంది.

మరోసారి పెంచే యోచన
ప్రస్తుత టికెట్‌ ధరల పెంపుతో ప్రయాణికులపై భారం పడనున్నప్పటికీ, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరోసారి కూడా చార్జీలు పెంచే అవకాశం ఉందనిపిస్తోంది. మరో 10 % మేర ధరలను సవరిస్తే నష్టాలను వీలైనంత మేర తగ్గించుకుని బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకుంటుందని అధికారుల అంచనా. మరో ఏడాది తర్వాత ప్రభుత్వానికి చార్జీలు పెంపుపై ప్రతిపాదించాలని యోచిస్తున్నారు. 

ఆర్థిక పరిస్థితిపై అంచనాకు వచ్చినందునే...
సాధారణంగా ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు అనగానే ఇటు ప్రజలతోపాటు అటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భగ్గుమనటం సహజం. ఈసారి ఆ స్థాయిలో నిరసనలు లేవు. సమ్మె వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డ జనం, నిరసనల్లో ఆర్టీసీ కార్మికులు చెప్పిన మాటలతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై ఓ అంచనాకొచ్చినట్టు కనిపిస్తోంది. బస్సు చార్జీలు పెంచితే తప్ప పరిస్థితి చక్కబడదన్న మాటలు ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. ఇక రాజకీయ పార్టీలు కొన్ని విమర్శలు చేసినా .. నిరసనల వరకు వెళ్లకపోవటం గమనార్హం. బస్సు చార్జీల పెంపు వల్ల ఇతర వస్తువుల ధరలు కూడా భగ్గుమంటాయన్న ఆందోళన జనంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూరగాయలను బస్సుల్లో తరలిస్తుంటారు. చార్జీల మోతతో వాటి ధరలు కూడా పెంచుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు