మేడారం జాతరకు 4 వేల బస్సులు

5 Jan, 2020 03:25 IST|Sakshi

రాష్ట్రంలోని 51 ప్రాంతాల నుంచి ఏర్పాటు

ఆర్టీసీ ఆపరేషన్స్‌ ఈడీ యాదగిరి

ములుగు/మేడారం: మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని 51 ప్రాంతా ల నుంచి 4 వేల బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) యాదగిరి చెప్పారు. ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని మేడారం హరిత హోటల్‌లో శనివారం ఇంజనీరింగ్‌ ఈడీ వినోద్‌కుమార్, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లుతో కలసి విలేకరులతో మాట్లాడారు. జాతర మొదలయ్యే ఫిబ్రవరి 2 నుంచి 9వరకు సేవలు అందిస్తామని, 23 లక్షల మందిని తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మేడారం విధుల్లో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది 12,500 మంది పాల్గొంటారని, 59 ఎకరాల్లో బస్టాండ్, 39 క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో సర్వేలెన్స్‌ కెమెరాలను బిగించి కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. జాతర సమయంలో ప్రస్తుతం ఉన్న చార్జీలకు 50% అదనంగా వసూలు చేయనున్న ట్లు వివరించారు. ప్రతి శని, ఆది, సోమవారాల్లో భక్తుల డిమాండ్‌ మేరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని, త్వరలో స్టేషన్‌ల వారీగా బస్సు చార్జీల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అంతకు ముందు మేడారంలో ఆర్టీసీ బస్టాండ్‌ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు.

మరిన్ని వార్తలు