ఆగదు ఆగదు ఆగదు.. ఆర్టీసీ సమ్మె ఆగదు..!!

6 Nov, 2019 10:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నేటితో 33వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్‌ను దాటుకుని ముందుకు సాగుతోంది. ఏదేమైనా డిమాండ్లు సాధిస్తామని కార్మికులు మెట్టు దిగడం లేదు. బుధవారం అన్ని బస్‌ డిపోల ముందు నిరాహార దీక్షలకు ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. డిపోల ముందు ధర్నాకు దిగి బస్సులను అడ్డుకున్న కార్మికులు, విపక్ష నేతల్ని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. సూర్యాపేట బస్‌డిపో ముందు అఖిలపక్ష నాయకులు, కార్మికులు ధర్నాకు దిగారు. బస్సులు బయటకు వెళ్లకుండా గేట్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నిరసనకారులను పోలీసులు స్టేషన్‌కు తరలించే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
(చదవండి : ఆర్టీసీ సమ్మె : వెనకడుగు వేయం)

ముఖ్యమంత్రి నిర్ణయం ఏమై ఉంటుందో..
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డెడ్‌లైన్‌ ముగిసిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే  5100 బస్‌ రూట్లను ప్రైవేటుకు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సమ్మెపై కార్మికులు మెట్టుదిగకపోవడంతో మిగిలిన 5 వేల రూట్లపై కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రైవేటు బస్సుల పర్మిట్‌లపై.. ఆర్టీసీ మనుగడపై ప్రభుత్వం సాయంత్రంలోపు ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు సమచారం. రేపు హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై కూడా ప్రభుత్వం చర్చించనుంది. డెడ్‌లైన్‌ ముగిసిన తర్వాత ఆర్టీసీ ఉండదని ఇప్పటికే కేసీఆర్‌ ప్రకటించడం గమనార్హం. 

డెడ్‌లైన్‌ లోపల చేరింది 373 మంది..
నాగర్‌కర్నూల్‌, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, కరీంనగర్‌-1, కామారెడ్డి, బాన్సువాడ, ఖమ్మం, మధిర, భద్రాద్రి కొత్తగూడెం, బోధన్‌, మిర్యాలగూడ, సూర్యాపేట బస్‌ డిపోల వద్ద నిరసనకు దిగిన కార్మికులు, అఖిలపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. బాన్సువాడ అంబెడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. 50 మంది నిరసనకారుల్ని పోలీసులు  అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇక డెడ్‌లైన్‌ లోపల రాష్ట్ర వ్యాప్తంగా 373 మంది కార్మికులు విధుల్లో చేరేందుకు రిపోర్టు చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా