ఆర్టీసీ సమ్మె: ఆగిన కార్మికుని గుండె

19 Nov, 2019 18:40 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల మరణాలు ఆగడం లేదు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కఠినవైఖరి వీడకపోవటంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేటలో చోటుచేసుకుంది. నర్సంపేటకు చెందిన యాకుబ్‌ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత 46 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో చురుకుగా పాల్గొంటున్నాడు. అయితే కార్మికుల పక్షాన కోర్టు తీర్పు రాకపోవడంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యాడు.

ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కార్మికుని మృతిపై జేఏసీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య అని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. మూడు నెలలుగా జీతాల్లేక ప్రభుత్వం పరోక్షంగా వేధించడం వల్లే యాకుబ్‌ మరణించాడని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల మృత్యు ఘోష ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినిపించటం లేదా అంటూ పలువురు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు