టీఎస్‌ఆర్టీసీ సమ్మె; స్పందించిన కేంద్రం

21 Nov, 2019 14:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేంద్రం స్పందించింది. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తానని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు గురువారం గడ్కరీని కలిశారు.

అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీని కోరినట్టు వెల్లడించారు. ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిని విడిచిపెట్టాలని సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుని, వారి కనీస డిమాండ్లను నెరవేర్చాలని కిషన్‌రెడ్డి కోరారు. తమ వినతిపై గడ్కరీ సాను​కూలంగా స్పందించారని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీయిచ్చినట్టు చెప్పారు.

పార్లమెంట్‌ ఆవరణలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో ఎంపీలు అరవింద్‌, సంజయ్‌

సునీల్ శర్మ సమాలోచనలు
మరోవైపు హైదరాబాద్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ సమావేశం నిర్వహించనున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలి అనే అంశంపై చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు విధించాలి, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సమావేశంలో దృష్టి పెట్టనున్నారు. భేటీ తర్వాత సీఏం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో అధికారులు కలవనున్నారు. (చదవండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష)

మరిన్ని వార్తలు