లోకేశ్... ఏంటా ‘కోత’లు!

29 May, 2015 01:49 IST|Sakshi
లోకేశ్... ఏంటా ‘కోత’లు!

మహానాడులో ‘విద్యుత్ అంతరాయం’ వ్యాఖ్యలపై టీఎస్‌ఎస్‌పీడీసీఎల్
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ సరఫరా తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు, ఆ పార్టీ నేత నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ‘ఇక్కడి సీఎం విద్యుత్ ఇవ్వడం లేదు..విద్యుత్ కోత ఎలా ఉందో చూడండి’ అంటూ లోకేశ్ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహానాడులో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. లోకేశ్ నిజనిజాలు తెలుసుకోకుండా స్పందించిన తీరును ఖండించింది.
 
 మహానాడులో మైకు సహా స్టేజీపై ఉన్న ఇతర పరికరాలకు డీజిల్ జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేసుకున్నారని, తమ కనెక్షన్‌ను వాడుకోలేదని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ గురువారం ఓ ప్రకటనలో తేల్చి చెప్పింది. జనరేటర్ ఎంసీబీ ట్రిప్ కావడం వల్లే అంతరాయం ఏర్పడిందని వెల్లడించింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు పేరుతో తీసుకున్న హెచ్‌టీ సర్వీసు కనెక్షన్‌ను కేవలం సభా ప్రాంగణానికి విద్యుత్ సరఫరా కోసమే వినియోగించుకున్నారని స్పష్టం చేసింది. ప్రాంగణానికి విద్యుత్ సరఫరా చేస్తున్న 11 కేవీ ఫీడర్ బుధవారం ట్రిప్ కాలేదని తెలిపింది.
 

మరిన్ని వార్తలు