సీతమ్మ శీతకన్ను..

2 Feb, 2020 08:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : ఈసారి కేంద్ర బడ్జెట్‌లోనూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మొండిచెయ్యే ఎదురైంది. ఏ ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయింపు జరగకపోగా.. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదా కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఈసారి కూడా పచ్చజెండా ఊగలేదు. కాజీపేట రైల్వే వ్యాగన్‌ ఫ్యాక్టరీకి నిధులు దక్కలేదు. రైల్వే డివిజన్‌ ఏర్పాటు అంశానికైతే బడ్జెట్‌లో స్థానమే  లభించలేదు. ఇక వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 1,200 ఎకరాల్లో ఏర్పాటవుతున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు జిల్లాలో ట్రైబల్‌ యూనివర్సిటీకి మోక్షం కలగలేదు. ఈ మేరకు పార్లమెంట్‌లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కథనం.

దక్కని జాతీయ హోదా
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కొన్నేళ్లుగా కేంద్రాన్ని కోరుతోంది. అయినా ఫలితం లేకుండా పోయింది. భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందనే ప్రభుత్వం నమ్మకంతో ఉన్నా నిరాశే ఎదురైంది. ఇక గిరిజన కుంభమేళాగా ములుగు జిల్లాలోని మేడారం జాతరకు కూడా జాతీయ హోదా కలగానే మిగిలిపోతోంది. కొన్నేళ్లుగా జాతరకు జాతీయ హోదా కోసం కోరుతున్నా మోక్షం కలగడం లేదు.

గిరిజన యూనివర్సిటీ
రాష్ట్రాల విభజన చట్టం ప్రకారం రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి ములుగు జిల్లా అనువైన ప్రాంతం కావడంతో అక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతయేడు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.4కోట్లను మాత్రమే కేటాయించారు. ఇక యూనివర్సిటీకి అవసరమైన 500 ఎకరాల్లో 497 ఎకరాలకు పైగా గుర్తించారు. కానీ ఈసారి బడ్జెట్‌లో ని«ధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగేలాల లేవు.

బయ్యారం ఊసేది?
ఇనుపరాయి గనులు విస్తారంగా ఉన్న బయ్యారంలో ఉక్కుపరిశ్రమ నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మానుకోట జిల్లావాసులకు ఈ బడ్జెట్‌లో కూడా నిరాశే ఎదురైంది. రెండోసారి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఏన్డీయే ప్రభుత్వం బయ్యారం పరిశ్రమపై ఏదైనా ప్రకటన చేస్తుందనుకున్న వారికి ఎదురుచూపులే మిగిలాయి. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన ఖనిజ నిక్షేపాలు 200 టన్నులకు పైగా ఉన్నట్లు అధికారులు గతంలో సర్వే ద్వారా గుర్తించారు.

పరిశ్రమకు బయ్యారం చెరువు ద్వారా నీటి సదుపాయం, రైల్వే రవాణ సౌకర్యాలు ఉన్నా కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే, జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేది. అలాగే, ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లాల్సి ఇబ్బందులు తప్పేవి. 

టెక్స్‌టైల్‌ పార్కు పరిస్థితీ అంతే...
వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని గీసుకొండ – సంగెం మండల్లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణం కోసం 22 అక్టోబర్‌ 2017లో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. పార్కు నిర్మాణం కోసం 1200 ఎకరాల భూమి సేకరించారు. పార్కులో అంతర్గత రోడ్ల నిర్మానం ఇప్పటికే జరుగుతుండగా.. పలు కంపెనీలు ఎంఓయూ కూడా చేసుకున్నాయి. ఈ పార్కు నిర్మాణం పూర్తయితే లక్ష మందికి పైగా ఉపాధి లభించే అవకాశముంది. టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదు.

ఇండస్ట్రియల్‌ కారిడార్‌..
హైదారాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు ఇండ్రస్టీయల్‌ కారిడార్‌ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కో రింది. కానీ ఈసారి బడ్జెట్‌లో స్థానం దక్కలేదు. రైల్వే డివిజన్, వ్యాగన్‌ షెడ్‌ దశాబ్దకాలానికి పైగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే డివిజన్‌ కేంద్రం ఏర్పాటుపై బడ్జెట్‌లో ప్రకటన వస్తుందనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. అదేవిధంగా రైల్వే వ్యాగన్‌ల తయారీ పరిశ్రమ ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా కాజీపేటకు మంజూరైన వ్యాగన్‌ పీరియాడిక్ల్‌ ఓవర్‌ హాలింగ్‌(పీఓహెచ్‌) షెడ్‌కు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లా వాసులతో పాటు రైల్వే కార్మికులు నిరాశ చెందారు.

అంతేకాకుండా బల్లార్షా – విజయవాడకు కాజీపేట మీదుగా వెళ్లే మూడో లైన్‌కు కూడా కేటాయింపు చేయలేదు. ఫిట్‌లైన్‌ ప్రస్తావన, ఎలక్ట్రిక్, డీజిల్‌ లోకోషెడ్ల ఊసు ఎత్తలేదు. కాజీపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి కేటాయింపులు, రైల్వే కార్మికులు, వారి పిల్లల సంక్షేమంపై ఎలాంటి ప్రకటన ఆర్థిక మంత్రి చేయలేదు. అయితే, రైల్వే ఉద్యోగులకు ఆదాయపు పన్నును కొద్దిమేర తగ్గించనున్నట్లు చెప్పడం, రైతుల కోసం కిసాన్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించడం కొంత ఆశాజనకంగా కనిపించింది.

తెలంగాణపై కేంద్రం వివక్ష
తెలంగాణపై ఈ బడ్జెట్‌లోనూ కేంద్రప్రభుత్వం వివక్ష చూపింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికే కాదు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సైతం అన్యాయం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని కోరినా పట్టించుకోలేదు. ఇతర కేటాయింపుల్లోను ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రానికి రావాలి్సన ప్రాజెక్టులకు కేటాయింపులు చేయలేదు. రైల్వే పరంగా మొండిచేయి చూపారు. 
– పసునూరి దయాకర్, వరంగల్‌ ఎంపీ  

>
మరిన్ని వార్తలు