ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రైతు దీక్ష

5 May, 2020 11:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైన్‌ షాప్‌లు తెరవడానికి ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రైతుల ధాన్యం కొనుగోలుపై లేదని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం రైతు సంక్షేమ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. వలస కూలీలను ఉచితంగా సొంత గ్రామాలకు తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ వలస కూలీల రవాణా ఛార్జీలను భరిస్తుందని ఆయన తెలిపారు. కేసీఆర్‌ మాటల వరకే పరిమితం అయ్యారని, వలస కూలీలు ఎంతమంది ఉన్నారనే విషయంలో ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదని ఉత్తమ్‌ మండిపడ్డారు. వలస కూలీలు వెళ్లిపోకుండ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. (లాక్‌డౌన్‌ ఉండగా మద్యం అమ్మకాలా?)

వలస కూలీలు వెళ్లిపోతే తెలంగాణలో అభివృద్ధి కుంటుపడుతుందని ఉత్తమ్‌ అన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రైతు దీక్ష చేపట్టామని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రతీ పేద కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 12  కేజీల బియ్యం విషయంలో మోసం చేసిందని ఉత్తమ్‌ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 12 కేజీల బియ్యంలో 5 కేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. మరో 6 కేజీల బియ్యం రెగ్యులర్‌గా ఇస్తారని తెలిపారు.  ఇక లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం అదనంగా ఇచ్చింది ఒక కేజీ బియ్యం మాత్రమే అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు