ఓ జ్ఞాపకం...   

17 Aug, 2018 10:51 IST|Sakshi
ఉమ్మడి జిల్లా సమస్యలను వాజ్‌పేయికి వివరిస్తున్న వంగ రాంచంద్రారెడ్డి (ఫైల్‌)  

సిద్దిపేటజోన్‌ : దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి మరణవార్త సిద్దిపేట ప్రాంత బీజేపీ శ్రేణులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ సందర్భంగా ఆయనకు సిద్దిపేటతో ఉన్న అనుబంధాన్ని నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. బీజేపీ పార్టీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా వాజ్‌పేయి మూడుసార్లు సిద్దిపేటను సందర్శించారు. మొదటిసారి 1975 ఏప్రిల్‌ 14న పార్టీకి నిధుల  సేకరణ, పార్టీ శ్రేణుల జాగృతిలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని పాతగంజిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

అప్పట్లో పార్టీ స్థానిక నాయకులు వంగ రాంచంద్రారెడ్డి.. వాజ్‌పేయికి స్వాగతం పలికారు. సిద్దిపేటలో పార్టీ అభిమానుల గురించి ఆ రోజుల్లోనే వాజ్‌పేయి ఆరా తీశారు. అదే విధంగా 1983లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట బీజేపీ అభ్యర్థి నిమ్మ నర్సింహారెడ్డి తరఫున సిద్దిపేటలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. చివరిగా 1988లో కరీంనగర్‌లో జరిగే పార్టీ కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యలో స్థానిక పాత బస్టాండ్‌ వద్ద ఆగిన వాజ్‌పేయిని కార్యకర్తలు సన్మానించారు. మరోవైపు సిద్దిపేట నాయకులు వంగ రాంచంద్రారెడ్డి, చొప్పదండి విద్యాసాగర్‌లు 1998లో వాజ్‌పేయిని ఘజియాబాద్‌లో కలిసి ఉమ్మడి జిల్లా ప్రగతి కోసం నివేదికను అందించారు.  

పలువురి సంతాపం  

దేశ ప్రధానిగా, బీజేపీ పార్టీ అగ్రనేతగా వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలు అనిర్వచణీయమని.., ఆయన మరణం పట్ల బీజేపీ రాష్ట్ర నాయకులు వంగ రాంచంద్రారెడ్డి, జిల్లా నాయకులు అంబడిపల్లి శ్రీనివాస్‌లు సంతాపం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు