కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీ?

18 Aug, 2014 00:07 IST|Sakshi
కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీ?

శాతవాహన యూనివర్సిటీ : రాష్ట్ర ప్రభుత్వం పీవీ నర్సింహారావు పేరిట ఏర్పా టు చేయనున్న వెటర్నరీ యూనివర్సిటీని కోరుట్లలోని వె టర్నరీ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేయించేందుకు నిజామాబాద్ ఎంపీ కవిత ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయమై ఇప్పటికే కళాశాల అధికారులతో చర్చించిన ఆమె ఆదివారం వారితో హైదరాబాద్‌లో మరోసారి స మావేశమయ్యారు. యూనివర్సిటీ ఏర్పాటు సంబంధిత విషయాలను వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ రమేశ్ గుప్తా ఎంపీకి వివరించినట్లు సమాచారం.
 
యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత మరిన్ని వసతులు సమకూర్చుకునే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం యూనివర్సిటీ ఏర్పాటుకు అనువుగా ఉన్న వసతులు, అనుకూల వాతావరణాన్ని ఆయన వివరించారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంపీ కవిత కలిసి వెటర్నరీ యూనివర్సిటీని కోరుట్లలో ఏర్పాటు చేయాలని కోరనున్నారు. జిల్లాలోని కథలాపూర్ ప్రాంతంలో ఉద్యానవన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారని భావించినా... సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో వెటర్నరీ యూనివర్సిటీని మన జిల్లాకు మంజూరు చేయించేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారు.
 
అనుకూల అంశాలు..

* ఇప్పటికే ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయ వెటర్నరీ సైన్స్ కళాశాలకు 58 ఎకరాల స్థలం ఉంది. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన అదనపు స్థలాన్ని ప్రభుత్వం సేకరించడానికి వీలుంది.
* హైదరాబాద్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కళాశాల కరీంనగర్ జిల్లా కేంద్రానికి 72 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచి రోడ్డు రవాణా సదుపాయాలు ఉన్నాయి.
* అవసరమైన విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, నీటి సదుపాయాలు, అంతర్గత రోడ్లు, ప్రహారీ ఉన్నాయి.
*అన్ని రకాల భవనాలున్నాయి. విద్యార్థులకు, విద్యార్థినులకు హాస్టళ్లున్నాయి. క్యాంటీన్, గెస్ట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ఇతర భవనాలు నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాయి. యూనివర్సిటీ నిర్వహణకు అవసరమయ్యే అదనపు ఏర్పాట్లు మాత్రం చేయవలసి ఉంటుంది.
* విద్యార్థులకు ఇండోర్ స్టేడియం, అవుట్‌డోర్ స్టేడి యం, ఉద్యోగులకు క్వార్టర్స్, హెల్త్ సెంటర్‌లకు ప్రతి పాదనలు ఇప్పటికే పంపారు. అనుమతి రావాల్సి ఉంది.
* పశు వైద్యశాలలు, దాణా కలిపే ప్లాంట్, పోస్ట్‌మార్టమ్ హాల్, పశువులకు షెడ్లు ఉన్నాయి.
* తెలంగాణలో ప్రాంతీయ సమతుల్యతకు సహకరిస్తుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చేరువలో ఉంటుంది.

మరిన్ని వార్తలు