నేల‘పాలు’ చేస్తుంటే కొత్తవేల!

17 Jul, 2018 02:26 IST|Sakshi

     విక్రయాలు లేక కునారిల్లుతున్న విజయ డెయిరీ

     రోజూ లక్ష లీటర్ల పాలు మిగులు

     కొత్తగా 65 వేల పాడి పశువులిస్తే వాటి పాలను ఏం చేయాలని అధికారుల సందేహం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విజయ డెయిరీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం రైతుల నుంచి సేకరిస్తున్న పాలనే విక్రయించే పరిస్థితి లేక కునారిల్లుతుంటే, మరోవైపు కొత్తగా సబ్సిడీపై పాడి పశువులు ఇస్తే వాటి పాలను ఏం చేయాలో అంతుబట్టక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నాణ్యమైన పాలు కావంటూ అనేకచోట్ల రోజూ వేలాది లీటర్లు పారబోస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే 2 లక్షల లీటర్ల పాలు పారబోయడంతో రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇలా వచ్చే పాలను అడ్డుకుంటుంటే, సబ్సిడీపై ఆవులు, గేదెలు ఇచ్చాక వచ్చే పాలను ఏం చేయాలన్న ఆందోళన విజయ డెయిరీలో నెలకొంది. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం కానీ, డెయిరీ అధికారులు కానీ ఎలాంటి ఆలోచనా చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

విక్రయాలేవీ..? 
వినియోగదారుల్లో విజయ డెయిరీ పాలపై మంచి అభిప్రాయమే ఉంది. కానీ మార్కెటింగ్‌లో సంస్కరణలు చేయడంతో ఒక్కసారిగా విజయ పాల విక్రయాలు పడిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో దశాబ్దాలుగా కొనసాగిన 1,600 మంది ఏజెంట్లను, ఆ వ్యవస్థను రద్దు చేయడంతో డెయిరీ పతనం ప్రారంభమైంది. ఏజెంట్ల వ్యవస్థ స్థానంలో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేయడం, డిస్ట్రిబ్యూటర్లంతా రాజకీయ అండదండలున్న వారే కావడంతో అనుభవం లేక విజయ డెయిరీ వ్యవస్థ కుప్పకూలిందన్న ఆరోపణలున్నాయి. 

రోజూ లక్ష లీటర్ల మిగులు! 
విజయ డెయిరీకి రోజూ 65 వేల మంది పాడి రైతులు 3.6 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. ప్రస్తుతం డెయిరీ పాల విక్రయాలు రెండు లక్షల లీటర్లకు అటుఇటుగా ఉన్నాయి. 40 వేల లీటర్లను అంగన్‌వాడీలకు పోసేందుకు టెట్రాప్యాక్‌లను తయారు చేస్తున్నారు. దీంతో రోజూ దాదాపు లక్ష లీటర్ల వరకు పాలు మిగులుతున్నాయి. వాస్తవానికి మిగులు పాలను పొడి, వెన్న తదితర ఉత్పత్తులను తయారు చేయడానికి వాడుతుంటారు. కానీ ఇప్పటికే తయారు చేసిన రూ.90 కోట్ల విలువైన పాల ఉత్పత్తులు అమ్ముడుపోక డెయిరీ నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో రోజూ లక్ష లీటర్ల పాలు మిగిలిపోతుంటే ఏంచేయాలో అధికారులకు అంతుబట్టడంలేదు. 

కొత్తగా మరో 6 లక్షల లీటర్లు! 
ప్రభుత్వం విజయ డెయిరీ సహా మరో మూడు డెయిరీలకు పాలు పోసే రైతులకు సబ్సిడీపై పాడి పశువులు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి గేదెలు లేదా ఆవులను సరఫరా చేస్తారు. 8 లీటర్లు ఇచ్చే గేదెలు, 10 లీటర్లు ఇచ్చే ఆవులను కొనుగోలు చేయాలని పశుసంవర్థక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు చాలామంది రైతులు ఆవులనే అధికంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 65 వేల మంది పాడి రైతుల నుంచి 65 వేల సబ్సిడీ గేదెలు లేదా ఆవుల ద్వారా మరో 6 లక్షల లీటర్ల వరకు పాలు అదనంగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం వస్తున్న 3.5 లక్షల లీటర్లనే విక్రయించే పరిస్థితి లేక విజయ డెయిరీ యాజమాన్యం పారబోస్తుంటే, అదనంగా వచ్చే మరో 6 లక్షల లీటర్ల పాలను ఏం చేయగలరన్నది అందరినీ వేధి స్తున్న ప్రశ్న. సబ్సిడీ పాడి పశువులు వచ్చాక మొత్తం 10 లక్షల లీటర్ల పాలు రోజూ విజయ డెయిరీకి రానున్నాయి. కానీ విక్రయాలు మాత్రం 2 లక్షల లీటర్లే. ఆ ప్రకారం మరో 8 లక్షల లీటర్లు రోజూ డెయిరీ వద్ద మిగిలిపోతాయనే చర్చ జరుగుతోంది.

సెలవులపై వెళ్లే యోచనలో అధికారులు 
నెల రోజుల వ్యవధిలో రెండు లక్షల లీటర్ల పాలను విజయ డెయిరీ పారబోసింది. పారబోసిన పాల సేకరణ ధర, రైతు ప్రోత్సాహకాన్ని కూడా నిలిపివేసినట్లు సమాచారం. డెయిరీకి చెందిన చిల్లింగ్‌ కేంద్రాలు, బల్క్‌మిల్క్‌ యూనిట్లు, గ్రామా ల్లో ఉన్న సేకరణ కేంద్రాల నుంచే ఈ పాలన్నీ విజయ డెయిరీకి ట్యాంకుల ద్వారా వస్తుంటాయి. ఆయా కేంద్రాల నుంచి తెచ్చిన పాలను హైదరాబాద్‌లో పారబోశారు. ఇప్పటినుంచి ఆయా కేంద్రాల వద్దే నాణ్యత నిర్ణయించి తిరస్కరించాలని, రైతులకు చెల్లింపులు ఉండవన్న నిర్ణయం తీసుకునేందుకు డెయిరీ సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఆయా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే రైతులకు ఇచ్చే సొమ్ముకు తామే బాధ్యత వహించాల్సి ఉంటుందని, దీనివల్ల పాడి రైతులు తమపై దాడులు చేసే అవకాశముందన్న భయాందోళనతో ఉన్నారు. దీంతో ఓ కేంద్రంలో పనిచేసే అధికారి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. మరికొందరు కూడా అదే యోచనలో ఉన్నట్లు తెలిసింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు