పెదవి విప్పేందుకు 72 గంటలా?

3 Dec, 2019 05:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘దిశ’హత్యోదంతం జరిగిన 72 గంటల తర్వాత సీఎం కేసీఆర్‌ పెదవి విప్పడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి దారుణ ఘటనలపై ఫిర్యాదు అందిన వెంటనే పరిధుల పేరుతో జాప్యం చేయకుండా పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారో సీఎం చెప్పలేదని ధ్వజమెత్తారు. అసలు విషయాల గురించి మాట్లాడకుండా కేవలం కంటితుడుపు చర్యగా ఓ ప్రకటన జారీచేసి తప్పించుకున్నారని విమర్శించారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా విచారణ పేరుతో మొక్కుబడిగా ఒక ప్రకటన జారీ చేసి దొరగారు చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: సురవరం 
సాక్షి, హైదరాబాద్‌: దిశ హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని సీపీఐ సీనియర్‌ నేత సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దిశ కుటుంబానికి బంధువు (తన తల్లి వైపు చుట్టరికం)గానే కాకుండా ఈ పాశవిక హత్యపై ఆగ్రహంతో ఉన్న కోట్లాది మంది ప్రజల్లో ఒకడిగా ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సోమవారం దిశ తల్లిదండ్రులను పరామర్శించిన సురవరం.. దిశ పోలీసులకు ఫోన్‌ చేయడానికి బదులు తన చెల్లెలికి ఫోన్‌ చేసిందంటూ ఆమెపైనే నెపం మోపే ప్రయత్నం.. వ్యవస్థలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోకి రాదంటూ తాత్సారం చేసిన పోలీసులను వెంటనే సర్వీస్‌ నుంచి తొలగిస్తే మరే పోలీసు ఇలాంటి చర్యలకు పాల్పడరని స్పష్టంచేశారు. పోలీసులకు పెద్ద పెద్ద భవనాలను నిర్మించడానికి బదులు సీసీటీవీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి పెట్రోలింగ్‌ టీంలను అలర్ట్ట్‌ చేసేందుకు తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు.

మరిన్ని వార్తలు