చీప్‌లిక్కర్‌పై సమరం

31 Aug, 2015 04:29 IST|Sakshi
చీప్‌లిక్కర్‌పై సమరం

గోదావరిఖని/కరీంనగర్/పెద్దపల్లి : చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలనే నిర్ణయూన్ని ఉపసంహరించుకోవాలని, చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్ తదితరులతో కలిసి ఆదివారం ఆయన కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు. గోదావరిఖనిలో ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

మద్యం మరింతగా అందుబాటులోకి రావడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, లిక్కర్ మాఫియూ పెరుగుతుందని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు రద్దు నిర్ణయూన్ని ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయూలని అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో మళ్లీ అనుమతులు, జలసంఘం నిపుణుల అభిప్రాయూలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. మధ్యమానేరు నిర్వాసితులకు పరిహారం అందించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల సకలజనుల సమ్మెతోనే కదలిక ఏర్పడగా, సమ్మెకాలపు వేతనాలు కార్మికులకు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయూలని, రూ.491 కోట్ల లాభాల్లో 30 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని అన్నారు. సెప్టెంబర్‌లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతంలో కూడా పర్యటిస్తారని వివరించారు. సింగరేణి ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేసీఆర్ హామీ ఇచ్చారని, దీంతోపాటు వారసత్వ ఉద్యోగాలు, ఇతర సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు.

ఆయూ చోట్ల డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, జనక్‌ప్రసాద్, నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి, జి.వినోద్, కోలేటి దామోదర్, హర్కర వేణుగోపాల్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కర్ర రాజశేఖర్, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, దిండిగాల మధు, మహేశ్, అంజనీకుమార్, గంట రమణారెడ్డి, సవితారెడ్డి, వేముల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు