యాసంగికి 1.70 లక్షల ఎకరాలకు నీరు

18 Aug, 2017 01:58 IST|Sakshi
యాసంగికి 1.70 లక్షల ఎకరాలకు నీరు

ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌:
వచ్చే యాసంగికి ఎత్తిపోతల పథకాల(లిఫ్టులు) కింద 1.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి వెల్లడించారు. కొత్తగా చేపట్టిన 74 పథకాల్లో 45 పథకాలను పూర్తి చేయడంతో 70 వేల ఎకరాలు, మరో 154 పథకాలను పునరుద్ధరణ చేయడం ద్వారా 90 వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఐడీసీ పథకాలపై నీటి పారుదల శాఖ సెక్రటరీ వికాస్‌రాజ్, ఐడీసీ ఎండీ సురేశ్‌కుమార్‌లతో కలసి అన్ని జిల్లాల ఎస్‌ఈ, ఈఈలతో శంకర్‌రెడ్డి గురువారం సమీక్ష జరిపారు.

ఐడీసీ పథకాల కింద నిర్ణయించిన ఆయకట్టు లక్ష్యాలు, జరుగుతున్న పనుల తీరుపై చర్చించారు. అనంతరం శంకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 582 ఎత్తిపోతల పథకాల్లో 404 పథకాలు పనిచేయడం లేదని, దశలవారీగా వాటిని పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా 12 ఎత్తిపోతలు ముంపునకు గురయ్యాయని, వీటిని కొత్తగా చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టామని వివరించారు. ఈ ఎత్తిపోతల పథకాలకు అందాల్సిన నిధులపై త్వరలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 5 కొత్త ఎత్తిపోతల పథకాలను ఈ నెల 28న ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు