వెక్కిరిస్తున్న పాతాళ గంగ

15 Oct, 2015 01:13 IST|Sakshi
వెక్కిరిస్తున్న పాతాళ గంగ

* రాష్ట్రంలో మరింత లోతుల్లోకి వెళ్లిన భూగర్భ జలాలు
* గత నెలలో 2.92 మీటర్ల అదనపు లోతుల్లోకి...
* ఏడు జిల్లాల్లో మరింత ఘోరం
* తాగు నీటికీ కటకట
* నిజామాబాద్ జిల్లాలో 6.57 మీటర్ల అదనపు లోతుల్లోకి జలాలు
* సెప్టెంబర్‌లో వర్షాలు కురిసినా ప్రయోజనం శూన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాతాళ గంగ మరింత లోతుల్లోకి వెళ్లి వెక్కిరిస్తోంది. పైకి రాకుండా మరింత కిందికి పోతోంది. తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులతో భూగర్భజలాలు మరీ ఘోరంగా అడుగంటిపోతున్నాయి.

బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. ఖరీఫ్ నట్టేట ముంచినా రబీ అయినా ఆదుకుంటుందన్న భరోసా లేదు. తాగునీటికీ కటకట ఏర్పడే ప్రమాదం నెలకొంది. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా భూ ఉపరితలం నుంచి కిందికి 8.82 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభించగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 11.74 మీటర్ల లోతులోకి అడుగంటాయి. ఏకంగా 2.92 మీటర్ల అదనపు లోతులోకి దిగజారింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోనైతే మరీ ఘోరంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో ఏకంగా 6.57 మీటర్ల అదనపు లోతుల్లోకి వెళ్లాయి.

మెదక్ జిల్లాలో 5.98 మీటర్ల అదనపు లోతుల్లోకి, మహబూబ్‌నగర్ జిల్లాలో 4.53 మీటర్ల అదనపు లోతుల్లోకి వెళ్లాయి. హైదరాబాద్‌లో అతి స్వల్పంగా 0.48 మీటర్లు, ఖమ్మం జిల్లాలో 0.29 మీటర్ల పైకి వచ్చి చేరాయి.  ఈ ఏడాది సెప్టెంబర్‌లో 23 శాతం అదనపు వర్షపాతం నమోదైనా ఆ నెలలో భూగర్భ జలాలు అడుగంటడం కలవరపెడుతోంది. మొత్తంగా గత జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావంతో సెప్టెంబర్‌లో అదనపు వర్షపాతం నమోదైనా ప్రయోజనం లేకుండా పోయిం ది. భూగర్భ జలాలు పడిపోవడంతో రాష్ట్రంలో పంటల పరిస్థితి ప్రమాదంలో పడింది. రాష్ట్రంలో బోర్లు, బావులపైనే వ్యవసాయం ఆధారపడి ఉంటుంది.

ఈ నేపథ్యంలో పాతళ గంగ పడిపోవడం ప్రమాద ఘంటికలను సూచిస్తోంది. ఇదిలావుంటే వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు 62 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 20 మి.మీ. నమోదైంది. 67 శాతం లోటు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు మరింత అడుగంటే ప్రమాదముందని అధికారులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇప్పటికీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. కేవలం వరంగల్, నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో ప్రధాన రిజర్వాయర్లలో గత ఏడాది అక్టోబర్ 14న 610.29 టీఎంసీల నీటి నిల్వలుండగా, ఈ ఏడాది అక్టోబర్ 14 (బుధవారం) నాటికి 283.20 టీఎంసీలే నిల్వలున్నాయి.
 
ప్రమాదంలో రబీ
తీవ్ర వర్షాభావం కారణంగా రబీ సీజన్ నిరాశజనకంగా ప్రారంభమైంది. రబీలో సాధారణంగా 31.32 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగాల్సి ఉంది. ఈ నెల 1 నుంచి 14 వరకు 1.37 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, 90 వేల ఎకరాల్లోనే జరిగింది. అందులో ఆహార ధాన్యాల సాగు 65 వేల ఎకరాల్లో జరిగింది. ఒక్క శనగ సాగే 55 వేల ఎకరాల్లో జరిగిందని వ్యవసాయశాఖ తేల్చిచెప్పింది. అయితే బోర్లు, బావులు, రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు లేకపోవడంతో పరిస్థితి ఘోరంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని వార్తలు