'బెయిల్ వస్తుందని ముందే ఊహించాం'

30 Jun, 2015 15:06 IST|Sakshi

హైదరాబాద్:ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి  బెయిల్ వస్తుందని ముందే ఊహించినట్లు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తెలిపారు. మంగళవారం రేవంత్ కు హైకోర్టు లో షరతులతో కూడిన బెయిల్ మంజూరైన అనంతరం అడిషనల్ ఏజీ మీడియాతో మాట్లాడారు. రేవంత్ కు బెయిల్ వస్తుందనే విషయాన్ని తాము ముందే ఊహించామని.. దానిలో భాగంగానే ఈ కేసుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న తమ న్యాయవాదులకు చేరవేశామన్నారు. ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడం బాధాకరమన్నారు. కేసు విచారణలో ఉండగా నిందితులకు బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు.

 

ఈ కేసులో నిందితులకు ఏపీ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. ఓటుకు కోట్లు కేసులో నిందితులగా ఉన్న మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్యలు విచారణకు సహకరించడం లేదని విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకువెళ్తామన్నారు. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు.. ఇస్తామన్న మరో నాలుగున్నర కోట్ల రూపాయిలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారించాల్సి ఉందన్నారు. రేవంత్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ రేపు లేదా ఎల్లుండి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని రామచంద్రరావు తెలిపారు.

మరిన్ని వార్తలు