వేములవాడను గొప్పక్షేత్రంగా తీర్చిదిద్దుతాం 

26 Jun, 2018 12:59 IST|Sakshi
మాట్లాడుతున్న ఎంపీ వినోద్‌కుమార్‌  

వేములవాడ : వేములవాడ ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. వేములవాడలో ఆలిండియా వెలమసంఘం భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ భానుప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కడారి దేవేందర్‌రావు, ఆలిండియా వెలమ సంఘం అధ్యక్షుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావులతో కలిసి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మిడ్‌మానేరు నుంచి నేరుగా వేములవాడ గుడి చెరువు, మూలవాగులో 365 రోజులు గోదావరి జలాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ శృంగేరి పీఠాధిపతులను వేములవాడకు తీసుకుని రానున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ ఆలిండియా వెలమ సంఘం భవనాన్ని వెలమలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని కోరారు.

ఆలిండియా వెలమ సంఘం అధ్యక్షుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ అనాథలు, నిరుపేదలను ఆదుకోవడమే సంస్థ లక్ష్యమన్నారు. స్థలదాత పాలెపు నర్సింగారావు, ఐవా జనరల్‌ సెక్రటరీ రామ్‌మోహన్‌రావు, ట్రెజరర్‌ జోగినపల్లి వెంకటనర్సింగారావు, శ్రీనివాస్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నామాల ఉమ, వెలమ సంఘం నాయకులు, సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు