చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?

1 Jun, 2015 21:53 IST|Sakshi
చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?

హైదరాబాద్:నామినేటెట్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు సూత్రధారి అయితే.. రేవంత్ రెడ్డి పాత్రధారని హరీశ్ మండిపడ్డారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీచేసిన ఐదుసీట్లనూ గెలుచుకున్న అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడారు. దగాకోరు, వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ఎద్దేవా చేశారు. అవినీతి గురించి మాట్లాడే మోదీ.. ఈ అంశంపై స్పందించాలని హరీశ్ డిమాండ్ చేశారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్న బాబుతో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ఏ రకంగా దోస్తీ చేస్తుందని నిలదీశారు.

 

ఈ విషయంలో బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ఏపీ ప్రజలను మోసం చేసి అక్రమాల ద్వారా డబ్బు సంపాదించి తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి హరీశ్ విమర్శించారు. ఏపీ ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ పెంచితే.. తెలుగువారు తలదించుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో చంద్రబాబు కూడా ఫోన్లో సంభాషించారన్నారు. ఈ విషయం కూడా త్వరలో బయటపడుతుందన్నారు.

మరిన్ని వార్తలు